మల్లాపూర్, మార్చి 16 : ‘మా గ్రామంలోని వందలాది మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయండి మహాప్రభో’ అంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను చూపుతూ ఆదివారం గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. రూ.2లక్షల లోపు రుణం తీసుకొని మాఫీ కాని రైతులు సుమారు 150మంది ఉన్నారని, అలాగే రూ.2లక్షలకు పైబడి రుణం తీసుకున్నవారు 200మందికి పైగా ఉన్నారని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు రుణమాఫీ కానివారి కోసం మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను ఆదివారం తీసుకున్నారు. శిబిరంలో 54మంది రైతులు దరఖాస్తులు అందజేశారు. వీరి సమస్య పరిష్కారం సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని మాజీ సర్పంచ్ తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం, ఇతర మంత్రులు రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నరు. కేవలం మా ఒక్క గ్రామంలోనే చానామంది రైతులకు ఒక్క పైసా సైతం రుణమాఫీ అందలేదు. రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినం. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో కలెక్టర్‌ను కలుస్తాం. ఎందుకు రుణమాఫీ కాలేదు.. ఎక్కడ జాప్యం జరిగిందో తెలుసుకొని రుణమాఫీ అయ్యేంత వరకు పోరాటం చేస్తాం.
నాకు గ్రామ శివారులో ఎకరం ఎవుసం భూమి ఉన్నది. మా గ్రామంలోని కెనరా బ్యాంక్‌లో కొన్నేండ్ల క్రితం రూ.50 వేల బాకీ తీసుకున్న. అయితే నాకు రుణమాఫీ కాలేదు. అధికారులు, బ్యాంక్ అధికారుల దగ్గరకు ఎన్నిసార్లు పోయినా.. ఎలాంటి ఫలితం లేదు. దేవుడి దయ ఉంటే నాకు మాఫీ వస్త్తది లేకుంటే లేదని నిర్ణయించుకున్న.
అందరికీ రుణమాఫీ అయితదని ఆశపడ్డం. నా అసోంటి చానామంది రైతులకు మా ఊళ్లే రుణమాఫీ కాలేదు. నాకు గ్రామంలో రెండు ఎకరాల ఎవుసం భూమి ఉన్నది. మక్క, పొలం వేసిన. మా గ్రామంలోని కెనరా బ్యాంక్‌లో రూ.70వేలు తీసుకుని వడ్డీ, అసలు కలిపి రెన్యువల్ చేసుకుంటు వస్తున్న. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు రూ.70వేలు మాఫీ అయినయి. ఎన్నికల ముందే మళ్లీ రూ.70వేలు తీసుకున్న. ఇప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కారు రుణమాఫీ చేయలేదు.