Ayyannapatrudu | ఆంధ్రా రాజకీయాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయని అన్నారు. ఆసక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ.. చాలామంది డబ్బులు లేక రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని తెలిపారు.
ఇక జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలపైనా అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. జగన్ మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జీతం తీసుకుని ఒక ఉద్యోగి ఉద్యోగానికి రాకపోతే సస్పెండ్ చేస్తారని తెలిపారు. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేయొద్దా అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా జగన్‌ను, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. అటువంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని నిలదీశారు. అసలు కోడికి, గుడ్డుకు తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి రోజాపైనా అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రోజా మాటలు వింటే మగాళ్లు కూడా సిగ్గుపడతారని.. అటువంటి అన్ని మాటలు సెల్ఫోన్ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే.. సెల్‌ఫోన్‌కు కూడా సెన్సార్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా మేధావులు పిల్ దాఖలు చేయాలని సూచించారు.