Dick Cheney : అమెరికా (USA) మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ (Dick Cheney) కన్నుమూశారు. న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఉపాధ్యక్షుడిగా చెనీ పేరుపొందారు. అగ్రరాజ్యం 46వ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు 9/11 ఉగ్రదాడులకు ప్రతీకారంగా అగ్రరాజ్యం చేపట్టిన ‘వార్ ఆన్ టెర్రర్ (ఉగ్రవాదంపై యుద్ధం)’ ప్రధాన రూపకర్తగా గుర్తింపు ఉంది.
ఇరాక్ లక్ష్యంగా ఆయన పదేపదే చేసిన ఆరోపణలు 2003లో ఆ దేశంపై అమెరికా దాడులు చేయడంలో కీలకపాత్ర పోషించాయి. డిక్ చెనీ 1941లో నెబ్రాస్కాలో జన్మించారు. చట్టసభ సభ్యుడిగా, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, డిఫెన్స్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. 2001-09 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దశాబ్దాలుగా శక్తిమంతమైన రిపబ్లికన్ నేతగా నిలిచారు.
కఠిన సంప్రదాయవాది అయిన చెనీ తన చివరి సంవత్సరాల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన్ను పిరికిపందగా, దేశానికి అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. దాంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ క్రమంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటేసినట్లు చెనీ ప్రకటించారు.