Sitarama Project | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కొర్రీ పెట్టింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావేశంలో సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌పై చర్చించింది. మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ దెబ్బతిన్న ఘటనను సాకుగా చూపుతూ అనుమతులను పెండింగ్‌లో పెట్టింది. మేడిగడ్డ ప్రమాదం నేపథ్యంలో సీతారామ డిజైన్లను మరోసారి సీడబ్ల్యూసీతో పరిశీలించాలని సూచించింది. వాస్తవానికి సీడబ్ల్యూసీ పరిధిలోని అన్ని విభాగాల నుంచి ఇప్పటికే డీపీఆర్‌లకు ఆమోదం లభించింది.
ఏ ప్రాజెక్టుకైనా సీడబ్ల్యూసీ అనుమతి వస్తే టీఏసీ అనుమతులు లభించడం లాంఛనమే. కానీ, కేంద్రం ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డను సాకుగా చూపి కొర్రీలు పెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే టీఏసీ అనుమతులు రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, గోదావరి బేసిన్ అధికారులు ఢిల్లీకి తరలివెళ్లారు. వారు గట్టిగా వాదనలు వినిపించకపోవడంతో అనుమతులు రాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే 14 నెలల్లో ఒక్క డీపీఆర్‌కు కూడా ఆమోదం లభించలేదని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. దీంతో ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో వేగంగా కొనసాగిన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్రేక్ పడిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు గతంలో ఏడాదిన్నర కాలంలోనే ఐదు ప్రాజెక్టులకు అనుమతులు సాధించిందని పేర్కొంటున్నారు. కానీ, ఇప్పుడు 14 నెలలుగా ఏకంగా నాలుగు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని విమర్శిస్తున్నారు.