భైంసా, మార్చి 24 : రైతుల కోసం సీఎం కేసీఆర్ మరో ఉద్యమం చేపట్టారని, ఇందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలోని నర్సింహ కళ్యాణమండపంలో గురువారం నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని పెంచడం.. పెద్దోళ్లకు దోచిపెట్టడం బీజేపీకి తెలిసిన విద్యేనని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కారు సామాన్యుడిపై ధరల భారం మోపుతూ, కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణపై వివక్ష చూపుతూ, రైతాంగానికి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో పచ్చనిపొలాలు, దిగుబడులు చూడలేకే విద్యుత్ మీటర్లు బిగించి, సాగును అడ్డుకోవాలనే కుట్రలకు కేంద్రం తెరలేపిందని పేర్కొన్నారు. దేశంలో ఏ రంగంలో చూసినా తెలంగాణ నంబర్ వన్‌గా ఎదగడంతో, అడ్డుకునే ప్రయత్నాలను మొదలుపెట్టిందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీ గౌడ్, బామ్ని రాజన్న, లోలం శ్యాంసుందర్, బుచ్చన్న, రాజేశ్ బాబు, చిన్నారావు, అఫ్రోజ్ ఖాన్, తోట రాము, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులున్నారు.