BJP | చెన్నై: లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టించాయి. ఆ రాష్ట్ర బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్‌రాజన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరువురి మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటున్నారు. తమిళిసై సౌందర్‌రాజన్ ఇటీవల మాట్లాడుతూ, బీజేపీలోకి ‘సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చార’న్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచ్చి సూరియ శివ మండిపడ్డారు.
తమిళిసై సిఫారసు మేరకు నియమితుడైన ఎల్ మురుగన్ పదవీ కాలంలోనే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిని పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. అలాంటివారి పేర్లతో ఓ జాబితాను తాను ఇవ్వగలనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నామలై కారణమని కొందరు ఆరోపించగా, ఆయన మద్దతుదారులు స్పందిస్తూ, రాష్ట్రంలో పార్టీ ఓటు షేర్ పెరిగిందని సమర్థిస్తున్నారు. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని మండిపడుతున్నారు.