MLA Anirudh Reddy | జడ్చర్ల, సెప్టెంబర్ 26 : ‘పలుమార్లు స్వయంగా హెచ్చరించినా.. రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా.. అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతూనే ఉన్నది. ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్నా.. చర్యలు తీసుకోకుంటే ఆదివారమే అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్లి తగులబెడ్త’ అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు తన ప్రెస్నోట్తోపాటు వీడియో, ఫొటోలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ సమీపంలోని ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్నదని, దీంతో ఆ చెరువులోని చేపలు చనిపోతున్నాయని, దాని పరిధిలోని పంటలు పండటం లేదని తెలిపారు. ఈ విషయాలను గతంలోనే తాను అసెంబ్లీలో ప్రస్తావించినా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు.
ఈ విషయంలో అధికారులకు, అరబిందో ఫార్మా కంపెనీకి మధ్య ఏ లాలూచీ ఉన్నదో తనకు తెలియదని తెలిపారు. మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలోనూ కలుషిత జలాలు వదిలితే కంపెనీని తగులబెడతానని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా తన హెచ్చరికలను పెడచెవిన పెట్టి కంపెనీ యథావిధిగా చెరువులోకి వ్యర్థాలను వదులుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్ బోర్డుకు శనివారం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని, తక్షణమే చర్యలు తీసుకొని కలుషిత జలాలను చెరువులోకి వదలకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు వెళ్లి దాన్ని తగులబెడతానని హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గ రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకునే ఓపిక తనకు లేదని తెలిపారు. చర్యలు తీసుకుంటారో, లేక కంపెనీ తగులబెట్టక తప్పని పరిస్థితి తీసుకొస్తారో మీ ఇష్టమని తేల్చి చెప్పారు.