హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ టికెట్ ధరల పెంపుపై కేసులు దాఖలవడాన్ని, టికెట్ ధరలను పెంచే అధికారం తమకు ఉన్నదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ జీవో 120 జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వమే మళ్లీ మెమోల ద్వారా టికెట్ ధరల పెంపునకు ఎలా అనుమతిస్తుందని నిలదీసింది. ఇలా ఎన్నాళ్లు దాగుడుమూతల ధోరణిని అవలంభిస్తుందని ప్రశ్నించింది. టికెట్ ధరలను నియంత్రించిన ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా మెమోలు జారీచేసేందుకు ఉన్న చట్టబద్ధతపై సమగ్ర విచారణ జరిపి, తుది ఉత్తర్వులు జారీచేయాల్సి ఉన్నదని తేల్చి చెప్పింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షోతోపాటు రెగ్యులర్ షోల టికెట్ ధరలను పెంపునకు అనుమతిస్తూ ఈ నెల 19న ప్రభుత్వం జారీచేసిన మెమో అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ మెమోను జారీచేసేటప్పుడు జీవో 120 గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ద్వంద్వ వైఖరితో ఉన్నప్పుడు కోర్టులు చూస్తూ ఊరుకోబోవని తేల్చి చెప్పింది. అందుకే ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ ఈ నెల 24న సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అక్టోబర్ 9న జరిగే తదుపరి విచారణ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ‘ఓజీ’ నిర్మాతతోపాటు ఆ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై గురువారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈ నెల 26 వరకు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీచేయాలంటూ పిటిషన్‌ను తిరిగి సింగిల్ జడ్జికే బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన బీ మలేశ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు.
ఇందులో హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవో 120లో మినహాయింపునకు మెమో జారీచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదన్నారు. టికెట్ ధరల వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యం వేసుకోవాలే తప్ప పిటిషన్ వేయకూడదని పేర్కొంటూ.. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సినిమాకు టికెట్ ధరలను పెంచడం సబబేనని చెప్పారు. టికెట్ ధరల పెంపు వద్దనుకునేవాళ్లు తొలి రోజు ఫస్ట్ షో చూడాలని ఏమీ లేదని, కొన్ని రోజుల తర్వాత సాధారణ ధరలకు లభ్యమయ్యే టికెట్లతో సినిమా చూసేందుకు వీలున్నదని తెలిపారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది మహేశ్ రాజే వాదిస్తూ.. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే టికెట్ ధరల పెంపు మెమో జారీ అయ్యిందన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇలాంటి కేసులు హైకోర్టులో నాలుగు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ 4 కేసుల్లో ప్రభుత్వం వేటిలోనూ కౌంటర్లు వేయలేదని చెప్పారు. జీవో 120కి భిన్నంగా ప్రభుత్వం మెమో ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. నాలుగు పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్లు వేయకుండా కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరల నియంత్రణకు జీవో ఇచ్చిన ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపునకు మెమో ఇవ్వడం చట్టబద్ధమో కాదో తేల్చుతామన్నారు. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు ఈ నెల 24న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామని ప్రకటించారు.