కరోనా కష్టకాలాన్ని కూడా ఎదురొన్న ఎల్అండ్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్లి పోయింది? పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణకు ఇది ఒక మాయని మచ్చ. ఫ్రీబస్ వల్ల మెట్రోకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినందుకు.. స్వయానా ముఖ్యమంత్రే ఎల్అండ్టీ సీఎఫ్‌వోను జైల్లో వేయండని చెప్పిన అన్నరు. ఇంత బహిరంగంగా బెదిరింపా? ఇంత అరాచకమా? తప్పులు ఎత్తి చూపితే జైల్లో వేస్తరా? -కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. మెట్రోకు కేటాయించిన భూములు, మాల్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరుల కన్నుపడిందని, వాటిని కాజేయడానికే ఎల్అండ్టీ సంస్థను కక్షగట్టి వేధించి తప్పుకొనేలా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత చర్యలతో రాష్ట్ర ప్రజలపై ఒకరోజే ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పుల భారం పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక సీమ్, ఒక సామ్ ఉంటుందని ఆరోపించారు.
ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని, కనీసం క్యాబినెట్
సబ్ కమిటీ కూడా వేయలేదని, క్యాబినెట్లో చర్చించలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము రూ.20 వేల కోట్ల ఆస్తిని సృష్టించి చేతిలో పెడితే సీఎం రేవంత్‌రెడ్డి రూ.15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, జీవన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎల్అండ్టీ సంస్థ నిష్రమణ వెనుక ఉన్న కుట్రలు, ప్రభుత్వ వైఫల్యాలను పూసగుచ్చినట్టు వివరించారు.
కోచ్‌లు సరిపోనంతగా అభివృద్ధి చేశాం ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొగాల్సి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే ఫ్రీగా మరమ్మతులు చేస్తామని ఎల్అండ్టీ సంస్థ ముందుకురావడమే రేవంత్‌రెడ్డికి కంటగింపుగా మారిందని, అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. ‘2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20-25 శాతం మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర విభజనతో రైడర్ షిప్ తగ్గుతుందని ఎల్అండ్టీ సంస్థ ఆందోళన చెందితే స్వయంగా కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు.
ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని భరోసా ఇచ్చి పనులను పరుగులు పెట్టించారు. కేవలం మూడేండ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉన్నదని భయపడితే కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. రూ.3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో 900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్‌లో కోచ్‌లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం. 69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి, దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్న మెట్రోలైన్‌ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్‌స్పేస్ వరకు పొడిగించి, సైవాక్లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం’ అని కేటీఆర్ వివరించారు.
400 కి.మీ. మెట్రో విస్తరణకు ప్రణాళికలు
హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించినట్టు కేటీఆర్ చెప్పారు. ‘మేము అధికారం నుంచి దిగిపోయే నాటికే 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించాం. ఓఆర్ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపాం. అత్యంత కీలకమైన మైండ్ స్పేస్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించాం. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దీనిని డిజైన్ చేశాం. కానీ, రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. నా భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చిపిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దుచేసి ఎల్‌అండ్‌టీపై మొదటి దెబ్బ వేశారు. అప్పటి నుంచే సీఎంకు, ఆ సంస్థకు మధ్య పంచాయితీ మొదలైంది’ అని కేటీఆర్ తెలిపారు.
ఎల్అండ్టీ ఎందుకు పోయిందో చెప్పాలి
పెట్టుబడులకు స్వర్గధామమైన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్ఠాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌చేశారు.‘మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి భారం పడకుండా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్అండ్టీ సంస్థ ముందుకొచ్చింది. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని బద్నాం చేద్దామనున్న రేవంత్‌రెడ్డి ప్రచారానికి ఇది గండికొట్టింది. తమ రాజకీయ లబ్ధికి ఎల్అండ్టీ సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబట్టారు. అకడి నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో వరకు ప్రతి విషయంలో ఆ సంస్థను వెంటాడి, వేధించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసిన ఎల్అండ్టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి, తన అనుచరుడైన బాంబులేటి శ్రీనివాస్‌రెడ్డి సంస్థకు పనులు కట్టబెట్టారు. మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్టులో పెడతా? అని బెదిరించారు. ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్అండ్టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసింది. తెలంగాణ రైజింగ్ అని చెప్పుకొనే సీఎం.. పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్ఠాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్ల అప్పు
కాగ్ లెకల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ రూ. 15 వేల కోట్లు అదనమని కేటీఆర్ చెప్పారు. ‘తెల్లారిలేస్తే ఖజానా ఖాళీ, అప్పు పుట్టడం లేదని సీఎం మొత్తుకుంటరు. ఐటీడీఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దికులేదు. ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న అప్పుల భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని రూ.15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి? మీ అహంకారపూరిత నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారు?’ అని కేటీఆర్ నిలదీశారు.
280 ఎకరాల భూములు అమ్ముకోవడానికే..
ఎల్అండ్టీ సంస్థను బలవంతంగా గెంటివేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘ఎల్అండ్టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితుల కన్ను పడింది. ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ సెచ్ వేశారు. ఇప్పటికే ఉన్న మాల్స్‌ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలోనే చూస్తారు. ఇది హైదరాబాద్ ప్రజల మీద వేసిన పెద్ద భారం. ఈ నిర్ణయంతో ఎల్అండ్టీ షేర్ విలువ 3 శాతం పెరిగింది. ‘చట్ మంగ్నీ.. ఫట్ షాదీ’ అన్నట్టు నిర్ణయం తీసుకుంటారా? దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. మేం సృష్టించిన రూ. 20 వేల కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే, మీరు 15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోబోం. నిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’ అని కేటీఆర్ వివరించారు.
కాంగ్రెస్‌కు బైబై ఎలక్షన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, ఇవి కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పే ఎన్నికలు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏదో అడ్డిమారు గుడ్డిదెబ్బలా హైదరాబాద్‌లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచారని, వచ్చే ఎన్నికల్లో తాము క్లీన్‌స్వీప్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నచ్చకనే స్వచ్ఛందంగా వచ్చి చాలా మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
మరో బ్లాక్మెయిల్ గురించి త్వరలో చెప్తా
తనను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నేను పదేండ్లు మంత్రిగా చేశాను. నీపై సీబీఐ కేసు, నీపైనా (రేవంత్‌రెడ్డి) సీబీఐ కేసు ఉన్నది. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. నా నిజాయితీకి భయం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి. రేవంత్‌రెడ్డికి పైశాచిక ఆనందం కలిగితే కలగనీయండి. కానీ, ప్రజల పక్షాన వృద్ధులకు రూ. 4,000 పెన్షన్, ఆడబిడ్డలకు రూ. 2,500, విద్యార్థినులకు సూటీలు ఎప్పుడిస్తావని అడుగుతూనే ఉంటాం. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతా’ అని కేటీఆర్ చెప్పారు.
పెద్దలకు చుట్టం.. పేదలకు భూతం హైడ్రా
కాంగ్రెస్ పాలనలో హైడ్రా అనే భూతంతో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీశారని కేటీఆర్ విమర్శించారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. పెద్దలకు చుట్టం.. పేదలకు భూతంలా హైడ్రా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాళ్ల బ్లాక్‌మెయిల్‌కు, బ్లాక్‌మెయిలర్స్‌కు హైడ్రానే కేంద్రంగా ఉన్నదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యపై సోషల్ మీడియాతో పోస్టు పెడుతున్న యువకులపై రౌడీషీట్లు తెరవడం తగదన్నారు. నిజంగా రౌడీషీట్ తెరవాలంటే ముందుగా రేవంత్‌రెడ్డిపైనే తెరవాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే మెట్రో రైలు రంగంలో అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) భాగస్వామ్యం ఎల్అండ్టీది. ఓఆర్ఆర్, మెట్రో, హైదరాబాద్‌లో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు.. ఇలా కొన్ని సంస్థలకు 40-60 ఏండ్లకు లీజుకు ఇస్తారు. అలాగని అవి ప్రైవేటుపరం అయిపోవు. ఇవి ప్రజా సంపదన. ప్రభుత్వం చేతికి మెట్రో అని పత్రికల్లో రాస్తున్నారు. చెప్పేవారికి లేకపోయినా
రాసేవారికి ఉండాలి కాదా. మెట్రో ఎప్పటి నుంచో ప్రభుత్వం చేతిలోనే ఉన్నది.
– కేటీఆర్
ప్రభుత్వం మెట్రోకు ఇచ్చిన 280 ఎకరాల భూమి మీద రేవంత్‌రెడ్డి కన్నుపడింది. ఎల్అండ్టీ సంస్థను వెళ్లగొట్టి ఆ 280 ఎకరాలను పంచుకోవాలని వీళ్లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, ఎల్అండ్టీ కట్టించిన కొన్ని మాల్స్ ఉన్నాయి. వీటన్నింటిని రేవంత్‌రెడ్డి తన స్నేహితులకు, దగ్గరగా ఉండే సంస్థలకు రాసివ్వాలని చూస్తున్నారు.
– కేటీఆర్
పండుగలు వచ్చాయంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్ డబుల్ చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలో 20 వేల మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సు పథకం వల్ల ప్రభుత్వం బకాయి పడింది. సంస్థ నష్టాల్లో ఉన్నదని కార్మికులు చెప్తున్నారు. ఒక్కో కార్మికులు 12-16 గంటలు పనిచేస్తున్నారు. పనిఒత్తిడి తాళలేక గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు. మెట్రో నడిపిస్తాడా?
– కేటీఆర్