పెంట్లవెల్లి, నవంబర్ 2 : మత్స్యకారులకు జీవనోపాధి కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి.. వారి జీవనోపాధిపై గండి కొడుతూ.. మత్స్య సంపదను సీమాంధ్ర జాలర్లు దోచుకెళ్లుతు న్నా.. పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు విమర్శలు గుప్పుమంటున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సమీపంలో పా రుతున్న కృష్ణానది (శ్రీశైలం బ్యాక్ వాటర్) తెలంగాణ, రాయలసీమకు చెందిన దళారులు అక్రమంగా రూ.కో ట్లను కొల్లగొడుతున్నా రేవంత్రెడ్డి సర్కారు నోరుమెదపకపోవడంపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణానది తీర గ్రామాలైన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని గూడెం, పెద్దమారూర్, చిన్నమారూర్, చెల్లెపాడు గ్రామాలను మొదలుకొని నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు, మంచాలకట్ట, వేంకల్, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి గ్రామాలతోపాటు చీమలతిప్ప, కోతిగుండు గ్రామాల సమీపంలోని కృష్ణానది తీరం ఒడ్డున తా త్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని తెలంగాణ మత్స్య సంపదను దోచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. నదీతీరాలతోపాటు చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది.
కృష్ణానది తీర ప్రాంతాల్లో మాత్రం సీమాంధ్ర దళారులు స్థానిక మత్స్యకారుల బతుకు దెరువుకు గండి కొడుతున్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన తుని, కొవ్వూరు, రాజమండ్రి, పూడిమర్క, గాజువాక, విజయవాడ, వైజాగ్ ప్రాం తాల మత్స్యకారులతోపాటు ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాల నుంచి మత్స్యకారులను తీసుకొచ్చి వా రికి వసతులు కల్పించడమేకాక ప్రోత్సహించి వారి తో నిషేధిత అలవి వలల ద్వరా చిన్న చేపపిల్లల(గుడ్డు)ను సైతం వదలకుండా వేటాడుతున్నారు. కృ ష్ణానది తీరప్రాంతాల ఒడ్డున గుడారాలను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
స్థానిక మత్స్యకారులు ఆభ్యంతరం వ్యక్తం చేసినా.. భయపడకుండా యథేచ్ఛగా తమ వేటను మూడు పూలు, ఆరుకాయలుగా సాగిస్తున్నారు. ఈ విషయంపై మత్స్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోపాటు మ త్స్యశాఖ, పోలీస్ శాఖకు సంబంధించి కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు భారీగా ముడుపులు అందుతుండటమే కారణమని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా పేరుకు మాత్ర మే తనిఖీలు చేస్తున్నారని, పైగా తప్పని పరిస్థితిలో అలవి వలలపై రైడింగ్ చేయాల్సి వస్త్తే సంబంధిత దళారులకు ఫోన్ ద్వారా ముందస్తు సమాచారం అందించి సీమాంధ్ర జాలర్లతోపాటు, నిషేధిత వలలను రహస్య ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కృష్ణానది తీర గ్రామాల్లో దళారులు తమ హద్దుబందులోని స్థలానికి(పట్టుకు)ఏటా వేలం నిర్వహిస్తారు. హద్దు(పట్టు)ను బట్టి రూ.6నుంచి15లక్షల వరకు తమ స్థలాన్ని వేలం ద్వారా లీజుకు ఇస్తారు. వేలం రెండు నెలల ముందే నిర్వహించి ఆంధ్రాజాలర్ల వద్ద అడ్వాన్స్ తీసుకుంటారు. స్థానిక దళారులతో చేతులు కలిపి సంబంధిత అధికారులతో మం తనాలు జరిపిన అనంతరం వివిధ శాఖాధికారులు లక్షల్లో ముడు పులు ఇచ్చాక వారితో హామీ తీ సుకొని నిషేధిత వలలతో తె లంగాణ మత్స్య సంపదను కొ ల్లగొడుతున్నారు.
బ్రిటీష్, నిజాం నవాబుల కా లంలో తిండిపెట్టి అమాయకులతో వె ట్టిచాకిరి చేయించుకునేవారు. కాలం మా రినా..కృష్ణానది తీరం వద్ద ప్రస్తుత పరిస్థితి ఆ నాటి రోజులనే గుర్తు చేస్తున్నాయి. నిషేధిత అలవి వలలతో తెలంగాణ మత్స్యసంపదను దోచుకోవడానికి ఆంధ్రామాఫియా ఆయా రాష్ర్టాల్లోని దళారులతో చేతులు కలిపి పనిపాట లేకుండా ఆర్టీసీ, రైల్వే బస్టాండ్లో అడ్రస్ ప్రూఫ్లేని ఎందరో అభాగ్యులకు అన్నంతోపాటు డబ్బు ఎర వేసి మీకు పని ఇప్పిస్తామని వారికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి రేయింబవళ్లు అలవి వలలను లాగిస్తూ.. నర కం చూపుతున్నారు. పనిఒత్తిడి తట్టుకోలేక పారిపో యే కార్మికులను పట్టుకొని విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటనలు లేకపోలేదు.
అలవి వలల యాజమానుల బాధలు భరించలేక గుడారాల నుంచి తప్పించుకొని పోవాలన్న లక్ష్యంతో రాత్రి వేళలో ఎవరూ లేని సమయాన కృష్ణాన దీ తీరం దాటి అవలి ఒడ్డుకు చేరేందుకు చేసే ప్రయత్నంలో ప్రతి యేటా ఐదారుగురు మృత్యువాతకు గురవుతున్నారు.అడ్రస్ ఉంటే మృతుడి కుటుంబానికి సమాచారం ఇస్తారు. లేదం టే ఆ శవాన్ని అక్కడే గుట్టు చప్పుడు కాకుండా జలసమాధి చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణానది తీరం వద్ద ఇంత జరుగుతున్నా నిషేధిత అలవి వల ల దందాను మాత్రం ఆపే అధికారే లేకపోవడం విడ్డూరమని నదితీర ప్రజలు ఆరోపిస్తున్నారు.