శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను సాధించింది. నవతరం, స్వదేశీ ‘బాహుబలి’ రాకెట్ ద్వారా భారత గడ్డపై నుంచి అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా 4,410 కేజీల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-03ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారత దేశ భూభాగంతోపాటు సముద్ర ప్రాంతాల్లో కూడా సేవలందిస్తుంది. ప్రత్యేకించి నేవీ కోసం దీన్ని రూపొందించారు. దేశం చుట్టూ విస్తరించిన సముద్ర ప్రాంతంలో టెలి కమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు.
ఇస్రో ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉపగ్రహాం నిర్దేశిత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లో ప్రవేశించింది. ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ, 4,410 కేజీల బరువుగల శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎల్వీఎం3కి అత్యధిక బరువును ఎత్తగలిగే సామర్థ్యం ఉండటాన్ని గుర్తు చేస్తూ, దానిని బాహుబలిగా అభివర్ణించారు. ఈ రాకెట్ ఇంతకుముందు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3ని ప్రయోగించిందని, భారత దేశానికి ఘనతను తెచ్చిపెట్టిందని చెప్పారు. ఆదివారం భారీ శాటిలైట్‌ను ప్రయోగించడంలో విజయం సాధించి భారత దేశానికి మరొక ఘనతను తెచ్చిపెట్టిందన్నారు. ఎల్వీఎం3 మొత్తం ఎనిమిదింటిని విజయవంతంగా ప్రయోగించిందని, వీటిలో ప్రయోగాత్మక మిషన్ కూడా ఉందని, దీని సక్సెస్ రేటు నూటికి నూరు శాతం అని వివరించారు.
కనీసం 15 ఏళ్లపాటు కమ్యూనికేషన్ సేవలను అందించే విధంగా ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇది స్వయం సమృద్ధ భారత్‌కు మరొక మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఇస్రో శాస్త్రవేత్తలు పరీక్షా కాలాన్ని ఎదుర్కొని, కఠోర శ్రమతో ఈ మిషన్ విజయవంతమయ్యేలా చేశారన్నారు. గతంలో ఇస్రో భారీ శాటిలైట్ల ప్రయోగానికి ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ లాంచ్ బేస్‌ను ఉపయోగించుకుంటూ ఉండేది. ఇక్కడి నుంచి 2018 డిసెంబర్ 5న భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-11ను ఏరియన్-5 బీఏ-246 రాకెట్ నుంచి ప్రయోగించింది. దీని బరువు 5,854 కేజీలు. ఇస్రో 1999 నుంచి శ్రీహరికోట నుంచి కస్టమర్ శాటిలైట్లకు లాంచ్ సర్వీసెస్‌ను అందిస్తున్నది. గగన్‌యాన్ మిషన్ కోసం లాంచ్ వెహికిల్‌గా హ్యూమన్ రేటెడ్ ఎల్వీఎం3ని ఇస్రో ప్లాన్ చేస్తున్నది. దీనికి హెచ్ఆర్ఎల్వీ అని పేరు పెట్టింది.