(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (AI) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ (IT), ఐటీఈఎస్ (ITES) సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. టెక్ సెక్టార్లో కొనసాగుతున్న కొలువుల కోతలు (Layoffs) ఉద్యోగులు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులపైనే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూయించవచ్చని టెక్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. జీడీపీ వృద్ధిలో వినియోగదారుల కొనుగోలు శక్తి అనేది కీలకపాత్ర పోషిస్తున్నది. కొనుగోళ్లు పెరిగితేనే వస్తు, సేవలకు గిరాకీ పెరుగుతుంది. అప్పుడే విపణిలో ద్రవ్య చలామణీ కొనసాగుతుంది. గడిచిన కొన్నేండ్లలో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, బంగారం తదితర కీలక ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడులకు సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగులే కీలకంగా ఉండేవారు. టెక్ సెక్టార్లో వేతనాలు, ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే, గడిచిన కొన్నేండ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 ఒక్క ఏడాదిలోనే భారత్‌లో 50 వేల మంది టెక్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. రానున్న ఆరు నెలల్లో మరో 50 వేల మందికి ఉద్వాసన ఉండనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే, జీడీపీ వృద్ధిలో కీలకమైన సేవా రంగం, రియల్ ఎస్టేట్‌లో ఐటీ ఉద్యోగుల ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2019-23 మధ్య ఐటీ ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం పెరుగుదల నమోదైతే, 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 5 శాతానికి మించలేదు. ఇదే సమయంలో కొలువుల కోతలు పెరిగాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించి, వస్తు-సేవలకు డిమాండ్ పడిపోతుంది. ఇది ద్రవ్య చలామణీకి అడ్డంకిగా మారి దేశ ఆర్థిక వృద్ధి మందగించడానికి కారణంగా మారొచ్చు. ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేందుకు టెక్ సిబ్బంది నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది.