కోస్గి, నవంబర్ 2 : పరిపాలనలో కాంగ్రెస్ వైఫ ల్యం.. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ చతికిలపడగా.. గులాబీ పార్టీ పట్నం నరేందర్‌రెడ్డి వరుస పర్యటనలు.. సమావేశాలతో ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నది. అధికారం కోసం ఆరు గ్యారెంటీలకు బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు.. తీరా అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే మిగతా వాటి ఊసే ఎత్తకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలం టూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేయడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలంటే వెనుకడుగు వేస్తున్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు నిలదీస్తే ఏం సమధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం తమ నేత నరేందర్‌రెడ్డి వరుస పర్యటనలతో ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఏమాత్రం తగ్గకుండా అదే స్పీడుతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు శాసం రామకృష్ణతోపాటు గులాబీ దళం చురుగ్గా ప్రజా సమస్యలపై పోరాడుతుండటం అధికార కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.
జెండా మోసిన వారిని పట్టించుకోకుండా కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైంది. మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎంతో నమ్మకంతో రేవంత్‌రెడ్డిని ఇక్కడి నుంచి గెలిపిస్తే తమ సమస్యలు పరిష్కరించకపోగా, కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కొన్ని గ్రామా ల్లో పేదల ఇంటి స్థలాలను కొందరు కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నా సీనియర్ నాయకులు స్పందించకుండా వారికే మద్దతివ్వడంతో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కొడంగల్ ప్రజలకు ఓటమితో పట్నం నరేందర్‌రెడ్డి దూరమవుతాడనుకుంటే ఆయన మరింత దగ్గరై ప్రజా సమస్యలు తీరుస్తూ కలిసిపోవడం బీఆర్ఎస్లో మరిం త జోష్ నింపింది. గతంలో లగచర్ల రైతులకు అండగా నిలబడి పోరాడాడు. అలాగే సర్జఖాన్‌పేటలో ఓ బీద కుటుంబానికి చెందిన కుటుంబాన్ని ఇబ్బంది పెడితే కుటుంబానికి భరోసా ఇచ్చి బాసటగా నిలుస్తున్నారు.