దుబాయ్, జూన్ 22: అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు, ఏడు బీ-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించిన స్టెల్త్ బాంబర్లు రెండు అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను జారవిడువగా, మరో అణు కేంద్రంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. బంకర్ బస్టర్ బాంబులు భూగర్భంలోని బంకర్లలోకి చొచ్చుకుపోయి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి.
దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇరాన్‌లోని కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. ‘అయితే శాంతి నెలకొంటుంది లేదా ఇరాన్‌కు విషాదం మిగులుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చట్టసభల అనుమతి లేకుండానే ట్రంప్ ఇరాన్‌పై దాడులకు అనుమతినిచ్చారు. గత తొమ్మిది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా తన దాడులను కొనసాగిస్తుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. అమెరికా దళాలపై టెహ్రాన్ ప్రతీకారానికి పాల్పడితే మరిన్ని దాడులు జరుపుతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేశామని చెప్పారు. దానిపై ఆరు బంకర్ బస్టర్ బాంబులను వేశామని తెలిపారు. ఇస్ఫహాన్, నతాంజ్‌పై తమ జలాంతర్గామి దాదాపు 440 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారు. బంకర్ బస్టర్ బాంబులు ఆరింటిని ఉపయోగించామని తెలిపారు. తమ యుద్ధ విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి వెలుపలికి వచ్చేశాయని అన్నారు. ‘ఇది అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచానికి చారిత్రక సమయం. ఇప్పుడైనా ఇరాన్ ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాలి’ అని తన ట్రంప్ వ్యాఖ్యానించారు.
అగ్రరాజ్యం దాడులపై స్పందించిన ఇరాన్.. అమెరికా ఓ ప్రమాదకరమైన యుద్ధాన్ని ప్రారంభించింది అని వ్యాఖ్యానించింది. ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ కేంద్రాలు దాడికి గురైన మాట నిజమేనని ఇరాన్ అణు ఇంధన సంస్థ ధ్రువీకరించింది. అయితే తాము అణు కార్యక్రమాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. దాడికి గురైన మూడు కేంద్రాల నుంచి ఎటువంటి రేడియో ధార్మిక ప్రభావం వెలువడలేదని ఇరాన్, ఐరాస పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ధంలో దిగిన అమెరికా ‘దౌత్య విధానానికి ద్రోహం చేసింది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి ఆరోపించారు. ‘అమెరికా తనంతట తానుగా ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓ ప్రమాదకర యుద్ధాన్ని ప్రారంభించింది’ అని వ్యాఖ్యానించారు. ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని అన్నారు. అమెరికా సైనిక దురాక్రమణను, దాని దుష్ట పాలకులను సంపూర్ణ శక్తితో ప్రతిఘటించే హక్కు ఇరాన్‌కు ఉందని పేర్కొన్నారు. ఈ ఘర్షణను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారు.. మేము అంతం చేస్తాం అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై దానికి పశ్చిమాసియాలో స్థానం లేదని పేర్కొంది.
ఇరాన్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. తమ దాడుల అనంతరం తమ దేశంతో చర్చలు జరిపే మరో అవకాశం ఇరాన్‌కు లభించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్లో పాలకులను మార్చడం కోసం తాము ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్‌ను చేపట్టలేదని హెగ్సెత్ చెప్పారు. ఇరాన్ ఇప్పటికైనా శాంతి మార్గాన్ని అనుసరించవచ్చు లేదా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే వ్యూహాన్ని అనుసరించవచ్చు అని అన్నారు.
మూడు బీ-2 స్టెల్త్ బాంబర్స్ ఆరు బంకర్-బస్టర్ బాంబులను ఫోర్డో అణు స్థావరంపై జార విడిచాయి.
400 మైళ్ల దూరంలోని వెల్లడించని స్థలం నుంచి జలాంతర్గాములు 30 టొమాహ్వక్ క్షిపణులను ప్రయోగించాయి.
Head