న్యూఢిల్లీ, నవంబర్ 12: అర్హులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్(పీసీ) కల్పించడానికి భారత ఆర్మీ అంగీకరించింది. ఈ మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ శుక్రవారం సుప్రీం కోర్టుకు సమాచారం ఇచ్చారు. అర్హులైనప్పటికీ తమకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించారని 72 మహిళా అధికారులు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మార్చిలో తీర్పునిచ్చింది. అర్హులందరికీ శాశ్వత కమిషన్ కల్పించాలని ఆదేశించింది. ఇందుకు మార్గదర్శకాలను జారీచేసింది.
అయితే, సైన్యం కేవలం 36 మందికే శాశ్వత కమిషన్ కల్పించింది. దీనిపై మిగిలిన 36 మంది మళ్లీ కోర్టుకు వెళ్లగా, సైన్యం 22 మందికి పర్మినెంట్ కమిషన్ కల్పించింది. వైద్య పరమైన కారణాలతో ముగ్గురిని, క్రమశిక్షణ తదితర కారణాలతో 11 మందిని అనర్హులుగా తేల్చింది. ఈ క్రమంలో ఒక అధికారి స్వచ్ఛందంగా పర్మినెంట్ కమిషన్‌ను వదులుకొన్నారు.
తమ తీర్పు ప్రకారం అర్హులైనప్పటికీ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఎందుకు నిరాకరించారని సైన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఆదేశాలను అమలు చేయనందున సైన్యం, ఆర్మీ చీఫ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరిస్తున్న సమయంలో సంజయ్ జైన్ జోక్యం చేసుకొని.. శాశ్వత కమిషన్ కల్పించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు.