న్యూఢిల్లీ: గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పరస్పరం డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర, పశ్చిమ భారతదేశ నగరాల్లోని 32 ఎయిర్‌పోర్టులకు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దుచేశాయి (Flights Cancelled). అయితే ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆ 32 విమానాశ్రయాలను తిరిగి తెరవడంతో మళ్లీ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, సోమవారం రాత్రి అమృత్‌సర్‌తోపాటు పలు ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించడంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు మరోసారి సర్వీసులను రద్దుచేశాయి. అమృత్సర్, జమ్ము, లేహ్, జోధ్‌పూర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌కు మంగళవారం తమ సర్వీసులను నడపడం లేదని ఇండిగో ప్రకటించింది.
భద్రతా కారణాల రీత్యా సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. అదేవిధంగా శ్రీనగర్, జమ్ము, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు శనివారం (ఏప్రిల్ 17) రాత్రి 11.59 వరకు విమానాలను నడపడం లేదని తెలిపింది. ‘ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యం. దీనివల్ల మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం ఏర్పడినప్పటికీ రద్దు చేయక తప్పడంలేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం’ అని కంపెనీ ప్రకటించింది.
#6ETravelUpdate pic.twitter.com/KnJYNZgOhF
— IndiGo (@IndiGo6E) May 12, 2025
ఎయిర్ ఇండియా కూడా ఇదేవిధమై ప్రకటన చేసింది. మంగళవారం జమ్ము, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ‘తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నగరాలకు మంగళవారం సర్వీసులను రద్దు చేస్తున్నాం. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అప్డేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం’ అని తమ ప్రకటనలో వెల్లడించింది.
Air India will progressively resume flights to and from Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot starting Tuesday, 13th May.
Bookings for these sectors are now open.
Guests are recommended to check their flight status at…
— Air India (@airindia) May 12, 2025
సోమవారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో డ్రోన్ల కదలికలు కన్పించాయి. అయితే పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. అయితే కలవరపడాల్సిన అవసరం ఏమీలేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంతదూరం వెళ్లాక తిరిగి వెనక్కి మళ్లించారు. అనంతరం విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.