పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట ప్రభుత్వ దవాఖానను జిల్లాస్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. వైద్యశాలను 250 పడకలతో నిర్మించేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది చొరవ చూపి సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో దవాఖాన నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేయనున్నారు.
నర్సంపేట/నర్సంపేట రూరల్, మార్చి 4 : నర్సంపేట ఇక హెల్త్ హబ్‌గా మారనుంది. నిరుపేదల ఆరోగ్యానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొండంత భరోసా కల్పిస్తున్నారు. ఆయన కృషితో పేదలకు కార్పొరేట్ వైద్యం అందనుంది. ఇప్పటికే జిల్లా స్థాయి దవాఖాన నిర్మాణానికి నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో 10ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికే భూమి పత్రాలను సంబంధిత రెవెన్యూ అధికారులు నర్సంపేట సివిల్ దవాఖాన సూపరింటెండెంట్ గోపాల్‌కు అందించారు. కాగా, శనివారం మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా 250 పడకల జిల్లా స్థాయి దవాఖానకు శంకుస్థాపన జరుగనుంది. అలాగే, కంటికి సంబంధించిన వైద్య సేవల కోసం ఆప్టోమెట్రిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. పేదోళ్లకు రోగమొస్తే దూర ప్రాంతంలోని కార్పొరేట్ దవాఖానకు పోయే ఇక్కట్లు ఇక తప్పనున్నాయి. కొన్నిసార్లు దవాఖానకు చేరకముందే పలువురి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పెద్ది కృషి, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో నర్సంపేట హెల్త్‌హబ్‌గా మారనుంది. కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం 24గంటల పాటు అందనుంది. ఇప్పటికే ఆస్పత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.66కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఇప్పటికే ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కోసం 184 పోస్టులు మంజూరయ్యాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు అందనున్నాయి. అంతేకాకుండా ఏఎన్ఎంలు, సిబ్బంది విధులు నిర్వర్తించడం కోసం 25 సబ్ సెంటర్లను నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
మంత్రి హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు శుక్రవారం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 6మండలాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలను బహిరంగ సభకు తరలించేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నారు. బహిరంగ సభ వద్ద చలువ పందిర్లు, తాగు నీటి వసతి కల్పించారు.