Priyanka Chaturvedi : భారత క్రికెట్ జట్టు ‘వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీ’లో పాల్గొంటుండటాన్ని శివసేన యూబీటీ (Shiva Sena – UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) తప్పుపట్టారు. WCL టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య ఈ నెల 20న మ్యాచ్ జరుగనుంది.
ఈ టోర్నీకి బీసీసీఐ భారత జట్టును అనుమతించడంపై చతుర్వేది మండిపడ్డారు. ఇది సిగ్గులేని చర్య అని విమర్శించారు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల నడుమ జాతీయ భావోద్వేగాలను పట్టించుకోకపోవడంపై తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో మండిపడ్డారు. డబ్ల్యూసీఎల్కు భారత జట్టును అనుమతించడం కచ్చితంగా సిగ్గులేని చర్య అని అన్నారు. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని భారత ప్రభుత్వం చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోకముందే పాక్‌తో మ్యాచ్‌లకు అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పహల్గాం ఉగ్రదాడిలో తమవారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం నైతిక దివాళాకోరుతనాన్ని సూచిస్తుందని చతుర్వేది ఘాటుగా విమర్శించారు. అయితే చతుర్వేది విమర్శలపై బీసీసీఐ కానీ, మ్యాచ్‌లో పాల్గొననున్న భారత క్రికెటర్లుగానీ స్పందించలేదు.