Crime news : బావతో వివాహేతర బంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆమె భర్త హత్య (Murder) కు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం హత్య చేసి ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ పోస్టుమార్టం (Autopsy) లో హత్య విషయం బయటపడింది. దాంతో పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన కరన్దేవ్ (36), సుష్మిత ఇద్దరూ భార్యాభర్తలు. సుష్మితకు కరన్ దేవ్‌కు వరుసకు సోదరుడైన రాహుల్‌తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి కరన్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం అతడికి రాత్రి భోజనంలో సుష్మిత 15 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత అతడు చనిపోవడానికి ఎంత టైమ్ పడుతుందనే దానిపై రాహుల్‌తో చాట్ చేసింది.
భోజనం తర్వాత చాలాసేపటి వరకు కరన్ శ్వాస తీసుకుంటుండటంతో ఇంకా చనిపోవడంలేదని సుష్మిత రాహుల్‌కు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత రాహుల్ సూచన మేరకు అతడికి కరెంట్ షాక్ ఇచ్చింది. ఆపై విద్యుత్ షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లాడంటూ మాతా రూపాణి మగ్గో ఆస్పత్రికి తరలించింది. అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. కరన్ కరెంట్ షాక్‌తో చనిపోయాడని పోస్టుమార్టం అక్కర్లేదని అతడి కుటుంబసభ్యులు చెప్పారు. అయితే మృతుడి వయసు, మరణించిన తీరును పరిగణలోకి తీసుకుంటే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. దాంతో మృతుడి భార్య సుష్మిత, ఆమె ప్రియుడు రాహుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో అనుమానించిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు.
పోస్టుమార్టంలో కరన్ హత్యకు గురైనట్లు వెల్లడైంది. నిద్రమాత్రలవల్ల మత్తు ఎక్కువై మరణించినట్లు తేలింది. ఈ క్రమంలో మృతుడి తమ్ముడు కునాల్.. తన వదిన సుష్మితకు, రాహుల్‌కు మధ్య వివాహేతర బంధం ఉందని అనుమానిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. వారిద్దరి ఇన్‌స్టా చాటింగ్స్‌ను పోలీసులకు చూపించాడు. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.