లోనావాలా: మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఇంట్లో చోరీ జరిగింది. అజార్ భార్య సంగీతా బిజ్లానీ ఉంటున్న లోనావాలా బంగ్లాలో సుమారు 50 వేల నగదు, ఖరీదైన టీవీని ఎత్తుకెళ్లారు. పుణె జిల్లాలోని మావల్ తాలూకలో ఉన్న తికోనా పీట్లో ఆ ప్రాపర్టీ ఉన్నది. మార్చి 7 నుంచి జూలై 18వ తేదీన మధ్య ఆ దొంగతనం జరిగినట్లు పోలీసులు చెప్పారు. కాంపౌండ్ గోడకు చెందిన వైర్‌ను కట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి ప్రవేశించారని, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్యాలరీకి ప్రవేశించి, విండో గ్రిల్‌ను ఓపెన్ చేశారు. ఆ తర్వాత బంగ్లాలోకి ఎంటరయ్యారు.
ఇంట్లో ఉన్న 50 వేల క్యాష్తో పాటు టీవీ సెట్‌ను దోచుకెళ్లారు. టీవీ విలువ సుమారు ఏడు వేలు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 57 వేల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. కావాలనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌కు చెందిన పర్సనల్ అసిస్టెంట్ ముజీబ్ ఖాన్ దొంగతనం గురించి ఫిర్యాదు చేశాడు. లోనావాలా రూరల్ పోలీసు స్టేషన్లో బీఎన్ఎస్ ప్రకారం 331(3), 331(4), 305(a), 324(4), 324(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూలై 19వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాపర్టీని ఇంత వరకు రికవరీ చేయలేదు. క్రైం సీన్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సాక్ష్యాలను సేకరిస్తున్నారు.