ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు అడుగడుగునా జనఛీత్కార సంకేతాలు బలంగా అందుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పోల్ పెట్టి మాయచేద్దామనుకున్న అధికారపార్టీకి జనం జవాబు ఊపిరాడకుండా చేసింది. తమ ప్రజాపాలన ఎలా ఉందో చెప్పాలంటూ పెట్టిన పోల్‌లో కాంగ్రెస్ చెంపచెల్లుమనేలా ప్రజలు సమాధానమిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో గురువారం పాలనకు రెఫరెండం అన్నట్టుగా ఓ పోల్‌ను నిర్వహించారు. ‘ఫాంహౌస్ పాలన కావాల్నా? ప్రజల వద్దకు పాలన కావాల్నా’ అని ప్రశ్నించగా.. 67 శాతంమంది ప్రజలు తమకు మేలుచేయని ‘ప్రజాపాలన’ను నిర్దంద్వంగా తిరస్కరించారు. కేసీఆర్‌ది క్షేత్ర పాలన కాదని, క్షేత్రస్థాయి పాలన అని కుండబద్ధలు కొట్టారు. అదే తమకు కావాలని తెగేసి చెప్పారు.
Congress | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తమ 420 రోజుల పాలనకు రెఫరెండం అన్నట్టుగా సోషల్‌మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన పోల్.. సెల్ఫ్‌గోల్ అయ్యింది. స్వయంప్రకటిత ప్రజాపాలనను ప్రజలు ఛీత్కరించారు. కేసీఆర్ పాలనే కావాలని నిర్దంద్వంగా తేల్చిచెప్పారు. బుధ, గురువారాల్లో కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆన్లైన్ పోల్ నిర్వహించగా.. ‘మీ పాలన మాకొద్దు’ అంటూ ముఖం మీద కొట్టినట్టే జనం తీర్పునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో అధికారికంగా ‘ఐఎన్‌సీ తెలంగాణ’ ఖాతాను నిర్వహిస్తున్నది. ఈ హ్యాండిల్ నుంచి బుధవారం సాయంత్రం 4.11 నిమిషాలకు ‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?’ అనే ప్రశ్నను పోస్టు చేసింది. పార్టీల పేర్లేవీ ప్రస్తావించకుండా.. ఫాంహౌస్ పాలన కావాలో, ప్రజల వద్దకు పాలన కావాలో తేల్చిచెప్పాలని కోరింది. రెండు ఆప్షన్స్‌తో 24 గంటల గడువుతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించింది.
బీఆర్ఎస్ పాలన అనే ఉద్దేశంతో ‘ఫాంహౌస్ పాలన’ అని, అట్లాగే కాంగ్రెస్ పాలన అనే ఉద్దేశంలో ‘ప్రజల వద్దకు పాలన’ అనే అప్షన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారిక ఖాతాలో పిన్ చేసిన పెట్టిన ఆ పోల్ బుధవారం రాత్రి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగా ఉండే ఈ ఖాతా ద్వారా ఆన్లైన్ పోలింగ్ నిర్వహిస్తే.. ట్రెండింగ్‌లో ప్రభుత్వానికి అనుకూల ఓట్లు వస్తాయని, ఈ ఫలితాలను హైలైట్ చేయటం ద్వారా ప్రభుత్వ పాలనకు ప్రజలు మద్దతు ఉందని ప్రచారం చేసుకునేందుకు వీలవుతుందని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త స్కెచ్ వేశారు. కానీ అంతా తలకిందులైంది. జనం వేల సంఖ్యలో ఆ ఓటింగ్‌లో పాల్గొని 420 రోజుల పాలనపై కుండబద్ధలు కొట్టారు. పోల్ మొదలైన మొదటి నాలుగు గంటల్లోనే 15,815 మంది నెటిజన్లు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని పసిగట్టిన ప్రజలు 74 శాతం మంది నిర్మొహమాటంగా ‘నిండా ముంచిన ప్రజాపాలన కన్నా ప్రజల గురించి ఆలోచించిన ఫాంహౌస్ పాలనే మేలు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనపై జనం తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో అప్రమత్తమైన కాంగ్రెస్.. ఆ పోల్‌లో కామెంట్లను ఆఫ్ చేసేసింది.
ఆన్లైన్ పోలింగ్‌లో తమకు ప్రతికూల ఓట్లు నమోదు అవుతుండటంతో టీపీసీసీ అలర్ట్ అయ్యింది. ఫలితం బీఆర్ఎస్ వైపే వస్తుండటంతో తన సోషల్‌మీడియా టీములను, కనుగోలు బృందాలను అప్రమత్తం చేసింది. ఇతర రాష్ర్టాలకు సంబంధించిన, జాతీయస్థాయిలో నడుస్తున్న పార్టీ హ్యాండిల్స్ సాయం కోరింది. బాట్, ఫేక్ అకౌంట్లతో ఓటింగ్‌ను తనకు అనుకూలంగా మార్చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పొరుగురాష్ట్రం మిత్రుల సహకారమూ తీసుకున్నది. గురువారం ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సోషల్‌మీడియా వర్కర్లను రంగంలోకి దించినట్టు, ప్రత్యేక క్యాంపెయినింగ్‌తో దాదాపు 300 మందితో ఏకకాలంలో ప్రమోషన్ వర్క్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఫేక్ ఐడీలు ఓపెన్ చేసి ట్వీట్లు, రీట్వీట్లతో దాదాపు 5 గంటలపాటు కుస్తీ పడితే.. సరిగ్గా 2.09 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ శాతం అతి స్వల్పంగా మెరుగుపడ్డది.
ఈ సమయంలో 65,387మంది నెటిజన్లు ఓటింగ్‌లో పాల్గొనగా..64 శాతం మంది బీఆర్ఎస్ పాలనకు అనుకూలంగా ,36 శాతం మంది కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆన్లైన్ పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి పోలైన అతిపెద్ద పోలింగ్ శాతం ఇదే కావటం గమనార్హం. ఇక ఆ తరువాత నుంచి బీఆర్ఎస్ అనుకూల ఓటింగ్ శాతం క్షణ కణానికి పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేతలు చేతులెత్తేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా తమ చేతిలోంచి వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ నేతలు తాము పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హైలైట్ కాకుండా అన్‌పిన్ చేశారు. అయినా కూడా నెటిజన్లు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. పోస్టు అన్‌పిన్ చేసిన తరువాత కూడా కేసీఆర్ పాలనకు అనుకూలంగా ఓటింగ్ శాతం పెరుగుతూనే వచ్చింది. జనంలో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ముందు కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. పోల్ ముగిసేనాటికి మొత్తం 92,551మంది ఓటు వేయగా.. 67శాతం మంది కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలిచారు. విశ్వప్రయత్నాల తర్వాత కూడా కాంగ్రెస్ పాలనకు 33 శాతానికి మించి ఓట్లు రాలేదు.
కేసీఆర్ పరిపాలనను కాంగ్రెస్ నేతలు ఫాంహౌజ్ పాలన అంటూ వ్యంగ్యంగా తక్కువ చేసి చూపుతూ చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ‘సారే మళ్లీ రావాలి.. తెలంగాణను ఏలాలి’ అని ముక్తకంఠంతో నినదించారు. ‘ఇందులో వెతుక్కోవటానికి లాజిక్‌లు ఏమీ లేవు.. అది ఫాంహౌస్ కాదు.. ఫార్మర్‌హౌస్ పాలన. వ్యవసాయ క్షేత్ర పాలన కాదది.. క్షేత్రస్థాయి పాలన. మాకదే కావాలి’ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. తన పాలనపై తానే ప్రజాభిప్రాయం కోరి.. కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నిర్వహించిన ఈ పోల్.. పూర్తికాకముందే రద్దు చేసుకున్న తీరు.. ప్రజాతీర్పు.. ఇవి జాతీయస్థాయిలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నేషనల్ మీడియా సైతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిన తీరుపై కథనాలు ప్రసారం చేశాయి.
తన పాలనపై తానే రెఫరెండం పెట్టుకుని, జాతీయస్థాయిలో తన పరువు తానే తీసుకున్న కాంగ్రెస్.. నష్టనివారణ చర్యలకు దిగింది. పోల్ ఫలితంపై కవరింగ్ మొదలుపెట్టింది. ఓటేసిన ప్రజలను, తెలంగాణవాదుల్ని, నెటిజన్లందరినీ బీఆర్ఎస్ సోషల్‌మీడియాగా జమకట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. పైగా ఫేక్ అకౌంట్లతో ఫలితాన్ని మార్చారంటూ కొత్తరాగం ఎత్తుకున్నది. తమ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను విస్మరించి.. తమ పార్టీ సోషల్ మీడియా విభాగం వీక్‌గా ఉన్నదంటూ సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. ప్రజలెవరూ ఫాంహౌస్ పాలనను కోరుకోవడం లేదని, మానిప్యులేషన్ సర్వేలు జరుగుతున్నాయంటూ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ పోల్ పోస్టును డిలీట్ చేసిన తర్వాత పలు సోషల్‌మీడియా ఖాతాలు, శాటిలైట్ చానళ్లు అదే పోల్‌ను తమ తమ వేదికలపై కొనసాగించాయి. ఆర్-టీవీ అనే వెబ్ చానల్ ఇదే అంశంపై డిబేట్ నిర్వహించింది. ‘నిజంగానే మీరు ఫాంహౌస్ పాలననే కోరుకుంటున్నారా?’ అనే ప్రశ్నతో లైవ్ పోలింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్‌లోనూ ప్రేక్షకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. టీవీ కార్యక్రమం 43వ నిమిషం వద్ద 3,278 మంది ప్రేక్షకులు ఓటింగ్ చేయగా.. 78 శాతం మంది బీఆర్ఎస్ పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 22శాతం మంది మాత్రమే రేవంత్‌రెడ్డి పాలనను సమర్ధించారు. 43వ నిమిషం తర్వాత ప్రతి సెకనుకు 200 మంది చొప్పున ఓటింగ్‌లో పాల్గొన్నారు. షో ముగిసే సమయానికి 11,066 మంది ప్రేక్షకులు ఓటు వేయగా 81 శాతం మంది కేసీఆర్ పాలనను, కేవలం 19 శాతం మంది రేవంత్ పాలనను సమర్థించారు.