China | న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత్కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చైనా నుంచి భారత్కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగా 56.29 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే వ్యవధితో పోల్చితే 11.5 శాతం అధికం. నాడు 50.48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు బుధవారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. చైనా తర్వాతి స్థానంలో రష్యా ఉన్నది. కాగా, 2013-14 నుంచి 2017-18 వరకు భారత్కు వాణిజ్య భాగస్వామిగా చైనానే అగ్రస్థానంలో ఉన్నది. 2020-21లోనూ ఇంతే. అంతకుముందు యూఏఈ టాప్లో ఉండేది. అయితే 2021-22 నుంచి 2023-24 వరకు అమెరికా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాత్రం మళ్లీ డ్రాగన్ దూసుకుపోతున్నది.
స్వల్పంగా పెరిగిన ఎగుమతులు
గత నెల సెప్టెంబర్లో భారతీయ ఎగుమతులు స్వల్పంగా పెరిగాయి. నిరుడుతో పోల్చితే 0.5 శాతం పెరిగి 34.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు 1.6 శాతం ఎగిసి 55.36 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 20.78 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత ఏడాది సెప్టెంబర్లో 54.49 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. ఏప్రిల్-జూన్లో వాణిజ్య లోటు 137.44 బిలియన్ డాలర్లు.