జెరుసలేం : ఇజ్రాయిల్‌లోని మౌంట్ మెరెన్ పవిత్ర స్థలం వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. యూదుల పండుగ లాగ్ బౌమర్ పండుగ సందర్భంగా వేలాది మంది యూదులు మెరెన్‌కు ప్రార్థనల కోసం తరలివచ్చిన సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందారని హిబ్రూ మీడియా తెలిపింది. అయితే ఘటనలో 38 మంది మృతి చెందారని రెస్క్యూ సర్వీసెస్ ధ్రువీకరించింది. 20 మందికిపైగా తీవ్ర గాయాలవగా.. పరిస్థితి విషమంగా ఉందని, మరో 39 మందికి తేలికపాటి గాయాలవగా హాస్పిటల్‌కు తరలించారు.
క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి మత గురువు రబ్బీ షిమోన్ బార్ యోహై సమాది ఉత్తర ఇజ్రాయిల్‌లోని మౌంట్ మెరైన్‌లో ఉంది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు ఏటా వేలాది సంఖ్యలో వస్తుంటారు. కరోనా ఆంక్షల సడలింపుల తర్వాత జరిగిన వేడుకకు వేలాది సంఖ్య హాజరవగా.. తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటకు కారణాలు మాత్రం తెలియరాలేదు. పవిత్ర స్థలం వద్ద ఏర్పాటు చేసిన కచేరీ స్టాండ్ పైకప్పు కూలడంతో దుర్ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా సమాచారం అందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
అయితే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియాల్లో యూదులు ఒకే చోట వేలాదిగా గుమిగూడినట్లు కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఒకే మూలకు తోసుకువచ్చారంటూ ఘటనలో గాయపడ్డ ఓ యువకుడు తెలిపాడు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్న వారంతా కిందపడిపోయారని చెప్పాడు. తర్వాత రెండో వరుసలో ఉన్న వారంతా వారిపై పడిపోయారని.. వెనుక ఉన్న వారంతా తమను నెట్టుకుంటూ మీద పడ్డారని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ఎండీఏ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ఘటనలో 38 మంది మృతి చెందారని, గాయపడ్డ వారిని సఫెడ్‌లోని జివ్ హాస్పిటల్, నహరియాలోని గెలీలీ మెడికల్ సెంటర్, హైఫాలోని రాంబం హాస్పిటల్, టెబెరియాస్‌లోని పోరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దుర్ఘటనను ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు. దుర్ఘటనలో బాధితుల పక్షాన ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని సూచించారు.
לכבוד התנא: עשרות אלפים בהדלקה המרכזית של תולדות אהרן שמרעידה את הההר מצד לצד pic.twitter.com/b2pMQsXv1z
— משה ויסברג (@moshe_nayes) April 29, 2021
"הדוחק היה חריג, מראות קשים מאוד": תיעוד ראשוני מרגעי האסון בהר מירון@rubih67 pic.twitter.com/MR7UBCVEHN
— כאן חדשות (@kann_news) April 29, 2021