న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఇటీవల వెల్‌లో ప్లకార్డులతో నిరసన చేపట్టిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మానిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ నలుగురూ ఇవాళ మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదు అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఒకవేళ ఎంపీలు ప్లకార్డులతో వస్తే, అప్పుడు ఎవరి మాట వినేదిలేదని,ఎవరిపైనా అయినా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ నలుగురికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు.
నలుగురు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత .. ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారి మాట్లాడుతూ.. గత 14 నెలల నుంచి ద్రవ్యోల్బణం రెండు అంకెల్లో ఉన్నట్లు ఆరోపించారు. గడిచిన 30 ఏళ్లలో ఇదే అత్యధికం అన్నారు. వినియోగదారుల ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రోజు వాడే బియ్యం, పెరుగు, పన్నీరు లాంటివాటిపై జీఎస్టీ పెరిగిందన్నారు. చిన్న పిల్లల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తివారి ఆరోపించారు.