వికారాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఇండ్లను నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ ఇండ్ల నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తైన వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మొదటి విడతగా రూ.లక్ష సాయం అందిస్తామని చెప్పినా లబ్ధిదారుల్లో చాలామందికి ఇప్పటికీ రూపాయీ అందలేదు. జిల్లాలో 2,285 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు మంజూరైతే వాటిలో కేవలం 35 ఇండ్లకు మాత్రమే రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందింది.
మిగిలిన లబ్ధిదారులు ఉన్న ఇండ్లను కూల్చుకుని..అప్పులు చేసి పునాది వరకు పూర్తి చేసుకోగా.. మరికొందరు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశామని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పైలెట్ గ్రామా ల్లో నాలుగు నెలలు గడుస్తున్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి కనిపించడం లేదు. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14,000 ఇండ్లు జిల్లాకు మంజూరయ్యాయి.
వాటిలో మొదటి విడతలో భాగంగా 2,285 ఇండ్లకు కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు. అయితే, వాటిలో 368 ఇండ్లకు గృహ నిర్మాణ శాఖ అధికారులు మార్కింగ్ ఇవ్వగా కేవలం 73 ఇండ్ల పనులు పునాది వరకు పూర్తికాగా, మిగతావి మార్కింగ్ దశలోనే నిలిచిపోయాయి. కాగా జిల్లాలో అర్హు లు 1,50,000 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతంలో ఇంటి నిర్మాణం ఎలాగున్నా బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పారని.. తీరా నిర్మాణం ప్రారంభించిన తర్వాత బిల్లుల చెల్లింపుల్లో హౌసింగ్ అధికారులు కొర్రీలు పెడుతున్నారని లబ్ధిదారు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 60 గజాల్లోపే ఇంటిని నిర్మించుకోవాలని.. నిబంధనలు అతిక్రమిస్తే బిల్లులు రావని చెబుతున్నారని వాపోతున్నారు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయారు.
దివ్యాంగురాలికి ఇల్లు ఇవ్వరా..?
ఇల్లు, భూమి కూడా లేదు. అద్దె ఇండ్లలో పిల్లలతో కలిసి ఉంటున్నా. తన భర్త 2013లో చనిపోయాడు. ఎంతమందికి ఇంటి గురించి దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇంటి ఓనర్లు ఎప్పుడు వెళ్లిపొమ్మంటే అప్పుడు ఇల్లు మారాల్సిందే. తాను దివ్యాంగురాలిని. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌పైనే బతుకుతున్నా. పిల్లలను చదివించేందుకు కుట్టు పని చేస్తున్నా. ఒక్కోసారి గిరాకీ ఉంటుంది. మరోసారి ఉండదు. కలెక్టర్‌ను కలవాల్నో, ఎవర్ని కలవాల్నో అర్థం కావడంలేదు. అధికారులు, నాయకులు స్పందించి తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
-గొల్ల స్రవంతి, తిమ్మాయిపల్లి గ్రామం, యాలాల మండలం
ఇంటిని కూల్చి.. కిరాయికి ఉంటున్నా..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఉన్న ఇంటిని కూల్చివేశా. ఇప్పుడేమో అధి కారు లు సర్వర్ రావడం లేదు. సర్వర్ వచ్చినప్పుడు నీ పేరు, ఇంటి స్థలం కంప్యూటర్లో ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాం. అప్పుడు ఇంటి నిర్మాణ పనులను చేపట్టవచ్చునని చెబుతున్నారు. ఇంటిని కూల్చేయడంతో కిరాయికి ఉంటు న్నా. ఎప్పుడు ఇంటి నిర్మాణం పూర్తవుతుందో.. ఇంకా ఎన్ని రోజులు అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుందో..?
-కుర్వ మల్లప్ప, మల్కన్‌గిరి, బషీరాబాద్
అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లా..?
గూడులేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ పేద లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీల్లో కాంగ్రెస్‌కు చెందిన వారే ఉండడంతో వారికి అనుకూలంగా ఉన్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని పలువురు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా పార్టీలకతీతంగా అర్హులందరికీ ఆయా పథకాల ఫలాలను అందజేసిందని.. కానీ, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. ప్రజాపాలనతోపాటు గతంలో స్వీకరించిన వా టిలో 2,50,000 దరఖాస్తులుండగా, వాటిలో 1,50, 000 దరఖాస్తుదారులను అర్హులుగా అధికారులు తేల్చారు.
నిరుపేదలకు ఇళ్లు రావా..?
మాకు రెండు చిన్న గదులున్నాయి. అందులో కుటుంబమంతా ఉండేందుకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అంతేకాకుండా వానకాలంలో ఇల్లు ఉరుస్తుండడంతో కవర్లు కప్పినం. ఇల్లు కూలుతుందేమోనని భ యంగా ఉన్నది. ఇందిరమ్మ ఇం టి కోసం దరఖాస్తు చేసుకున్నా. ఎవరూ పట్టించుకోవడంలేదు. తనలాంటి పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆదుకోవాలి.
-గొల్ల వెంకటప్ప, తిమ్మాయిపల్లి గ్రామం, యాలాల
కాంగ్రెస్ లీడ్లరే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా.. ?
మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇల్లు కావాలంటే రూ. 20 వేలు ఇవ్వాల్సిందేనని ఒక కాంగ్రెస్ లీడర్ డిమాండ్ చేస్తున్నాడు. నిరుపేదలు అన్ని డబ్బులు ఇచ్చి ఇల్లు కొనుక్కోవాలా..? ఈలాంటి వ్యక్తులపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకొని గూడ లేని నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి.
-బాలప్ప, జనగాం గ్రామం పెద్దేముల్
బేస్మెంట్ నిర్మించి రెండు నెలలవుతున్నది..
జాబితాలో పేరు వచ్చిందన్న సంతోషంతో ఉన్న ఇంటిని కూలగొట్టి.. బేస్మెంట్ వరకు ఇంటిని నిర్మించా. బేస్మెంట్ వరకు పూర్తి కాగానే రూ.లక్ష చెల్లిస్తామని అధికారులు చెప్పా రు. దాదాపుగా రెండు నెలలు దాటుతున్నా ఇప్పటివరకూ రూపాయీ రాలేదు. అధికారులను అడిగితే.. మీ గ్రామంలోని మిగిలిన లబ్ధిదారులు బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే.. ఆ వివరాలను పై అధికారులకు పంపిస్తామని అప్పుడు డబ్బులు వస్తాయని చెబుతున్నారు.
– అనురాధ, మల్కన్‌గిరి, బషీరాబాద్
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయరూ..
నా భర్త సర్దార్తో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మాకు ముగ్గురు సంతానం. మట్టి గోడలతో ఉన్న మా ఇల్లు ఈదురుగాలులు, వర్షానికి కూలిపోయింది. కూలిపోయిన భాగంలో కవర్ కప్పి అందులోనే జీవిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశించాం కానీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేమనే ఉద్దేశంతో రాలేదని తెలిసింది. అధికారులు స్పందించి గూడు లేని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది.
-లాల్‌బీ, సంతాపూర్, కేశంపేట
నిధులను త్వరగా చెల్లిస్తే బాగుండు..
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు రావడంతో ఇంటి నిర్మాణానికి పనులు ప్రారంభించా. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది. నిర్మాణం పూ ర్తైన తర్వాత డబ్బులు వస్తాయో రావో అనే దిగులుగా ఉన్నది. ఇంటి నిర్మాణానికి రూ .5 లక్షలు సరిపోవు. అప్పులు తీసుకొచ్చిన పూర్తి చేయాల్సిందే.
-కెరెళ్లి ప్రియాంక, పెండ్లి మడుగు, వికారాబాద్
రూ.3 లక్షలు అప్పు చేశా..
రూ.మూడు లక్షల వరకు అప్పు చేసి ఇందిరమ్మ ఇంటిని బేస్మెంట్ వర కు పూర్తి చేశా. బిల్లు చెల్లించేందుకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. 764 ఎస్ఎఫ్టీలో బేస్మెంట్కట్టారని అధికారులు తమకు రావాల్సిన రూ.లక్ష బిల్లు చెల్లించడం లేదు.
-కుర్వ మమత, తాండూరు రూరల్
నిబంధనల ప్రకారం నిర్మించలేదని..
ఉన్న ఇంటిని కూల్చి.. ఇందిరమ్మ ఇంటిని బేస్మెంట్ వరకు పూర్తి చేశా. రూ.లక్ష బిల్లు మంజూరు చేయాలని అధికారులను కోరితే, నిబంధనల ప్రకారం మీరు ఇంటిని కట్టలేదని బిల్లు చెల్లించడం లేదు. 40-60 గజాల కంటే ఎక్కువస్థలంలో ఇంటి నిర్మించారని.. అందుకే బిల్లులు రావని చెబుతున్నారు. ఉన్న ఇంటిని కూల్చి, అద్దె ఇంట్లో ఉంటున్నాం. బిల్లులు రాకుంటే ఎలా..?
-కుమ్మరి రాములు, తాండూరు రూరల్