చెన్నూర్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బాల్క సుమన్ అన్నారు. ఆదివారం చెన్నూర్ పట్టణంలోని 16వ వార్డు పరిధిలోని చింతలగూడెం, కొత్తగూడెం కాలనీల నుంచి మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్‌తో పాటు దాదాపు 200మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ బాల్క సుమన్ పార్టీ కండువాలను కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్ పట్టణంలో వంద పడకల దవాఖాన, బస్ డిపో, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు లాంటి అభివృద్ధి పనులతో పాటు చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు లాంటి పనులన్నీ అర్ధంతరంగా నిలిచి పోయాయని పేర్కొన్నారు. తాము గతంలో తీసుకువచ్చిన రూ. 50కోట్ల నిధులతోనే మంత్రి వివేక్ చెన్నూర్ పట్టణంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడున్నారే తప్పా కొత్తగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. నియోజకవర్గంలో రైతులు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలను మంత్రి వివేక్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు తాను తీసుకువచ్చిన ఎత్తి పోతల పథకాన్ని మంత్రి వివేక్ ఆపి వేశారని ఆరోపించారు. మంత్రి నిర్లక్ష్యంతో రూ.500 కోట్ల నిధులతో తాను తీసుకవచ్చిన ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ కూడా తరలిపోయిందన్నారు.
అభివృద్ధికి దూరమైన చెన్నూర్ నియోజకవర్గ దుస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. జగిత్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ ఇలా ఎక్కడికి వెళ్లినా ‘కాంగ్రెస్ సర్కార్ పోవాలి, కేసీఆర్ సర్కార్ రావాలి’ అనే నినాదం మర్మోగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నారని, ప్రస్తు తం కరెంటు కష్టాలతో పాటు యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఆరుగురు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఉండగా బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చితే ఒక్కరు కూడా నోరుమెదపలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడంతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందన్నారు. కాబట్టి మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో గెలిపించుకోవాలని, మళ్లీ రాష్ర్టాన్ని గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలలో బీఆర్ఎస్లో చేరబోతున్నారని, ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వస్తారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అనే విషయం కాంగ్రెస్ పార్టీ వారు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. చెన్నూర్‌లో కొత్తగా గెలిచిన మున్సిపల్ పాలక వర్గం సభ్యులు, మంత్రి వివేక్ రూ.200కోట్ల నిధులు తీసుక వచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా మాయమాటలు చెబితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కరకట్ట నిర్మాణం, యూనివర్సిటీ ఏర్పాటు, 45వేల ఉద్యోగాల కల్పన, ఫ్యాక్టరీ పెట్టడం, ముంపు గ్రామాల భూములు కొనడం లాంటి ఇచ్చిన హామీలను వెంటనే మంత్రి వివేక్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలు, రైతులు, పేదలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలన్నారు. చెన్నూర్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, కొత్తగా మంత్రి వివేక్ తేవాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులున్నారు.
పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన బాల్క సుమన్
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 19: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి కండీషన్ బెయిల్ విషయమై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు. ఆయనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, రామడి లక్ష్మీకాంత్, అనిల్ సంతకం చేశారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారమేశ్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, బీ. అనిల్ రావు, బండారి సూరిబాబు తదితరులు ఉన్నారు.