కోహీర్, జూలై 27: ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీ అయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన నగల వ్యాపారి ఆశిష్ హైదరాబాద్లో రూ.2.80 కోట్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ నుంచి ఆరెంజ్ సంస్థకు చెందిన ట్రావెల్స్ బస్సులో ముంబైకి పయనమయ్యాడు. శుక్రవారం రాత్రి జహీరాబాద్ సమీపంలోని సత్వార్ గ్రామ శివారులో ఉన్న కోహినూర్ దాబా వద్ద బస్సు ఆగింది.
దీంతో ఆశిష్ బస్సులో నుంచి కిందకు దిగాడు. కొద్దిసేపటికి తిరిగి బస్సులోకి వెళ్లి చూసేసరికి బంగారంతో ఉన్న బ్యాగు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లినట్టు తెలిసింది. ఆశిష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నారాయణఖేడ్ డీఎస్పీ రామ్మోహన్రెడ్డి తెలిపారు.