న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సోమవారం సమర్పించిన ఒక నివేదికలో తెలిపారు. భారత ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో అమికస్ క్యూరీ (న్యాయస్థానపు స్నేహితుడు)గా విజయ్ హన్సారియా వ్యవహరిస్తున్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 ఆరోపణలు/కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు ఉన్నారు. ఆయనపై 29 పెండింగ్ కేసులు ఉన్నాయి. లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మంది, రాజ్యసభలోని 233 మంది సభ్యుల్లో 75 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఈ వ్యాజ్యాన్ని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాదాపు 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 519 కేసులు దశాబ్దానికిపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 700 కేసుల్లో ఇంకా విచారణ కూడా ప్రారంభం కాలేదని, పైగా వీటిలో 360 కేసులు చార్జిషీట్ కూడా దాఖలు కాకుండా మూడేళ్లకుపైగా ఇదే దశలో నిలిచిపోయాయని తేలింది.