న్యూఢిల్లీ: బ్యాటరీ, హైడ్రోజన్ ఇంధన, సహజ వాయువుతో నడిచే వాహనాల జీవిత కాలాన్ని ఐదేండ్ల పాటు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989, సవరణల ముసాయిదాను రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంగళవారం జారీ చేసింది. ఈ నెల 10న ప్రచురించిన ప్రతిపాదిత నిబంధనల్లో మార్పుల్లో భాగంగా వీటిపై సలహాలు, సూచనలను 30 రోజుల్లో తెలియజేయాలంటూ కోరింది. అయితే అధికారికంగా తుది గెజిట్ ప్రచురితమైన తర్వాతే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
గరిష్ట జీవిత కాలపరిమితి ఎంతో పేర్కొనపోయినప్పటికీ పైన పేర్కొన్న వాహనాల జీవిత కాలాన్ని ఇప్పుడున్న దానికి ఐదేండ్ల పాటు పొడిగిస్తారు. మల్టీ యాక్సిల్ సరకు రవాణా వాహనం 15 ఏండ్లు, ఇతర వాహనాలు 12 ఏండ్లు పూర్తిచేస్తే వాటిని మార్చకుండా వాటి జీవిత కాలాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకోవచ్చు. అయితే దీని నిమిత్తం వాహన యజమాని నేషనల్ పర్మిట్ ఖాతాకు ప్రతి ఏటా రూ.16,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ పర్మిట్ల ప్రక్రియను మరింత డిజిటలీకరించాలని కేంద్రం భావిస్తున్నది.