కొచ్చి: కేరళలోని కొచ్చి (Kochi) సమీపంలోని అలువాలో విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టుపై ఉన్న రామ చిలుకను (Parrot) పట్టుకునేందుకు ప్రయత్నించిన 12 ఏండ్ల బాలుడు అదే చెట్టు మీద పడటంతో మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం సుధీర్, సబియా దంపతుల కుమారుడు ముహమ్మద్ సినాన్ తన స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపలో ఉన్న ఓ ఎండిపోయిన చెట్టుపై వారికి రామచిలుక కనిపించింది. దీంతో దానిని పట్టుకోవాలని అనుకున్నారు. ఇంకేముంది.. ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చిలుకను కిందికి దించేందుకు.. చెట్టును ఊపడం ప్రారంభించారు పిల్లలు. అయితే చిలుక అక్కడి నుంచి వెళ్లిపోగా.. చెట్టు మీదపడటంతో ముహమ్మద్ సినాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినాన్ తోట్టక్కుటుకరాలోని హోళి ఘోస్ట్ కాన్వెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడని చెప్పారు.