న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: భూమి చుట్టూ ఓ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్న చంద్రుడు.. క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతున్నాడట! చంద్రుడు ప్రతి ఏటా 3.8 సెంటీమీటర్లు భూమి నుంచి దూరంగా పోతున్నాడని పరిశోధకులు లెక్కగట్టారు. చంద్రుడిపై భూ గురుత్వాకర్షణ శక్తిలో సంభవిస్తున్న మార్పులే ఇందుకు కారణమని తేల్చారు. దీంతో చంద్రుడి కక్ష్యామార్గం 20,000 కిలోమీటర్ల వరకు తగ్గుతున్నదని, అందువల్లే భూమిపై కొన్ని ప్రాంతాల్లో సూపర్మూన్లు వంటివి కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
చంద్రుడి ఆకర్షణ శక్తి.. భూమిపై ఒకవైపు 4 శాతం ఎక్కువ ఉంటున్నదని, మరోవైపు తగ్గుతున్నదని, ఇది భూమిపై కొన్ని చోట్ల సముద్రాలపై అలల శక్తిని పెంచుతున్నదని తెలిపారు. అందువల్లే న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ మొదలైన చోట్ల సముద్రాలు హఠాత్తుగా వెనక్కి వెళ్లటం, మరోచోట సముద్రమట్టాలు పెరగటం వంటివి సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.