వాషింగ్టన్, సెప్టెంబర్ 28: అమెరికాలో కొంతమంది మహిళలు కృత్రిమ మేథ (ఏఐ) చాట్‌బాట్‌తో ప్రేమలో పడుతున్నారట. తాత్కాలిక కాలంపాటు రొమాంటిక్ రిలేషన్షిష్ కొనసాగిస్తున్నారట. అమెరికా మహిళల్లో 19 శాతం మంది (ప్రతి ఐదుగురిలో ఒకరు) తమ రొమాంటిక్ రిలేషన్షిప్ కోసం ఏఐ చాట్‌బాట్స్‌ను వాడుతున్నట్టు ‘మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎంఐటీ) తాజా అధ్యయనం పేర్కొన్నది.
పలు సర్వేలు, ఆయా రాష్ర్టాల్లోని మహిళల ఆన్లైన్ డాటా వినియోగం ఆధారంగా పరిశోధకులు పై అంచనాకు వచ్చారు. ఈ విధమైన ధోరణి వల్ల సదరు వ్యక్తుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని అధ్యయనం హెచ్చరించింది. తీవ్రమైన ఒంటరితనం, మతిభ్రంశంబారిన పడతారని తెలిపింది. తమకు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయని 1.7 శాతం మంది యూజర్లు సర్వేలో చెప్పారు. మరికొంత మంది జ్ఞాపకశక్తి లోపించిందన్న విషయాన్ని చెప్పారు. ఈ అధ్యయనానికి ముందు, ఏఐ చాట్‌బాట్‌తో లవ్‌లో పడ్డ కొంతమంది వివాహిత మహిళల్లోనూ పై సమస్యలు కనపడ్డాయని తెలిసింది.