భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిపై ప్రయాణించే వాహనాలు ఒకేసారి 90 డిగ్రీల మలుపు తిరిగితే, ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లోని ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సుదీర్ఘ సమయం వేచి ఉండవలసిన అవసరాన్ని నివారించడం కోసం ఈ వంతెనను నిర్మించారు.
దీనివల్ల మహామాయి కా బాగ్, పుష్ప నగర్, స్టేషన్ ఏరియా వారికి ప్రయోజనం కలుగుతుంది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే మూడు లక్షల మందికి ఈ వంతెన ఉపయోగకరం. ప్రయాణానికి పట్టే సమయం తగ్గుతుందని, ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. . ప్రజా పనుల శాఖలోని వంతెనల శాఖ చీఫ్ ఇంజినీరు వీడీ వర్మ మాట్లాడుతూభూమి తగినంత అందుబాటులో లేనందువల్ల మరో అవకాశం లేకపోయిందని, ఈ వంతెనపై నుంచి చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రెండు కాలనీలను అనుసంధానం చేయడానికే ఈ వంతెనను నిర్మించినట్లు తెలిపారు. వాహనాల వేగాన్ని పరిమితం చేస్తామన్నారు.