న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి (Students) కూడా చేరలేదు. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో తెలంగాణ (Telangana) ఉంది. కొత్తగా విద్యార్థులు చేరని పాఠశాలల్లో మొత్తం 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే వీరి సంఖ్య 17,965 ఉంది. వీరితో పాటు అక్కడ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు 3,812 ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే 2024-25లో ఇక్కడ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు 2,245 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఉన్న టీచర్ల సంఖ్య 1,016. 463 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు, 223 టీచర్లతో తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. దేశంలో 2024-25 విద్యాసంవత్సరంలో 7,993 పాఠశాలల్లో కొత్తగా ఎలాంటి చేరికలు లేవు. హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ర్టాల్లో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, దాద్రా, నగర్ హవేలీ, అండమాన్, నికోబార్ ద్వీపాలు, డామన్ డయ్యు, చండీగఢ్లతో పాటు ఢిల్లీలో కూడా సున్నా ప్రవేశాలు లేదు.
రాష్ర్టాల పరిధిలోని అంశం: కేంద్రం
ఉత్తరప్రదేశ్లో 81 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ నమోదు అయ్యాయి. వరుసగా మూడు విద్యా సంవత్సరాలలో జీరో ఎన్రోల్మెంట్ నమోదు అయిన పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని యోచిస్తున్నట్టు యూపీ మాధ్యమిక్ శిక్ష పరిషత్ (యూపీ బోర్డు) తెలిపింది. అదే సమయంలో ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి కూడా ప్రస్తావించింది. ఆ రాష్ట్రంలో అలాంటి పాఠశాలలు లక్షకు పైగా ఉన్నాయని, అవి సమష్ఠిగా 33 లక్షల మందికి విద్యాబోధన అందిస్తున్నాయని తెలిపింది. జీరో నమోదు సమస్య రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆయా రాష్ర్టాలకు సూచించామని కేంద్ర విద్యా శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, ఇతర వనరులను గరిష్ఠంగా వినియోగించడానికి పాఠశాలలను విలీనం చేశాయని ఆయన చెప్పారు. దశల వారీగా ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.