Madhya Pradesh | నర్సింగ్పూర్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా, ట్రామా వార్డులో ఒక యువతిపై దాడిచేసిన యువకుడు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. దీనిని అడ్డుకోవడానికి అక్కడే ఉన్న నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు ఎంతమాత్రం ప్రయత్నించ లేదు. 10 నిమిషాల పాటు జరిగిన ఈ దారుణాన్ని అడ్డుకోకపోగా, దానిని కొందరు సెల్ఫోన్లో వీడియో తీశారు. సంధ్యా చౌదరి(19)పై నిందితుడు అభిషేక్ కోష్టి జూన్ 27న ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ప్రేమ వ్యవహారం కారణంగానే అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తున్నది. స్నేహితురాలి వదినను పరామర్శించడానికి నర్సింగ్పూర్లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన సంధ్యతో నిందితుడు రూమ్ బయట కొద్దిసేపు మాట్లాడాడు. తర్వాత ట్రామా వార్డులో ఆమెను కొట్టి నేలపై పడేసి, ఆమె ఛాతిపై కూర్చుని గొంతు కోశాడు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న బాధితురాలి పక్కనుంచే చాలామంది నడుచుకుంటూ పోయారే తప్ప ఆమెను పట్టించుకోలేదు. తర్వాత నిందితుడు అదే కత్తితో తన గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి, అది సాధ్యం కాక అక్కడి నుంచి బైక్ ఎక్కి పారిపోయాడు.