Damini App | సహజంగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, గాలిదుమారాలు, వడగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుంటాం. పిడుగును (lightning) ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ, అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేశంలో సంభవించే అత్యధిక మరణాలకు పిడుగులే కారణం..! భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం పిడుగులతో ఏటా దేశం లో 2,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.
వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడడం సహజం. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయో చెప్పడం అసాధ్యం. దాంతో చాలా మంది వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి ముందుగానే సమాచారం తెలుసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘దామిని లైటింగ్ అలర్ట్’ అనే పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ మొబైల్లో ఈ యాప్ ఉన్నట్లయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
దీనిని 2020లో కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ (ఐఐటీఎం)’ రూపొందించింది. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. దామి ని లైటింగ్ అలర్ట్ అనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇది అలర్ట్ ఇస్తుంటుంది. చదువుకోని వారికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలర్ట్ సౌండ్ ద్వారా విపత్తును ముందుగానే పసిగట్టొచ్చు. అంతేకాదు పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2020లో 2,862 మంది, 2021లో 2,880 మంది, 2022లో 2,887 మంది మరణించారు. గ్రామాల్లోనే 95-96 శాతం పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోల్చితే మన దేశంలో పిడుగుపాటు మరణాలు చాలా ఎక్కువ. అమెరికాలో ఏటా సరాసరి 20 మరణాలు సంభవిస్తున్నాయి. 2006 నుంచి 2021 వరకు ఆ దేశంలో 444 మంది పిడుగులతో చనిపోయారు.
మన దేశంలో 1967 నుంచి 2019 వరకు లక్ష మంది పిడుగుపాటుకు గురై మరణించారు. ఇది 52 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించిన మరణాల్లో దాదాపు 33 శాతం..! అలాగే వరదల కారణంగా సంభవించిన మరణాలకంటే రెండింతలు ఎక్కువ..! ఐఎండీ గణాంకాల మేరకు ఈశాన్య రాష్ర్టాల్లో అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. కానీ, మధ్యభారతంలోనే పిడుగుపాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. జూలైలో ఉత్తరప్రదేశ్ పిడుగులతో దద్దరిల్లిపోయింది. జూన్, జూలైలో బీహార్‌లో ఏకంగా 50 మంది దాకా మృత్యువాతపడ్డారు. ఆ రెండు రాష్ర్టాల్లో నెల వ్యవధిలోనే పిడుగుల కారణంగా సంభవించిన మరణాలు వందకు పైనే ఉన్నాయి. 2019 నుంచి దేశంలో పిడుగుపాటు మరణాలు 20 నుంచి 35 శాతం మేర పెరిగినట్టు ఐఎండీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కానీ వీటిని ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుండటం గమనార్హం.
Also Read..
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Trash balloons | కిమ్ వదిలిన చెత్త బెలూన్ల కారణంగా.. సియోల్‌లో మూతపడుతున్న ఎయిర్‌పోర్ట్‌లు
Jani Master | జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు.. పోలీసులకు రంగారెడ్డి కోర్టు ఆదేశం