Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమాయకులను, ప్రత్యర్ధులను టార్గెట్ చేసేందుకు యూపీ ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతోందని, 2027 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బుల్డోజర్లు గోరఖ్‌పూర్ మళ్లుతాయని యోగి టార్గెట్‌గా అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. బుల్డోజర్లకు మెదడు అవసరం లేదని, స్టీరింగ్ ఉంటే చాలని అన్నారు.
బుల్డోజర్ స్టీరింగ్‌ను యూపీ ప్రజలు మార్చేస్తారని యోగిపై విరుచుకుపడ్డారు. అయితే అఖిలేష్ వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దీటుగా బదులిచ్చారు. బుల్డోజర్ను హ్యాండిల్ చేసే ప్రతిఒక్కరికీ ఆ సామర్ధ్యం, సత్తా ఉండవని వ్యాఖ్యానించారు. బుల్డోజర్ను నిర్వహించాలంటే హృదయం, మనసు రెండూ అవసరమని స్పష్టం చేశారు. దమ్ము, అంకితభావం కలిగిన వారే ఇలాంటి టాస్క్‌లను నెగ్గుకురాగలరని పేర్కొన్నారు.
ఇవాళ వీరు సరికొత్త రూపంలో ప్రజలను తప్పుదారిపట్టించేందుకు వస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి చేతులు బుల్డోజర్కు ఫిట్ కావని చెప్పుకొచ్చారు. అల్లరి మూకల ముందు సాగిలపడే వారు బుల్డోజర్ ముందు నిలవలేరని ఎద్దేవా చేశారు. సుల్తాన్ కావాలనే వారి కలలు ఫలించబోవని అఖిలేష్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ యోగి పేర్కొన్నారు. ఎస్పీ హయాంలో అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ దోపిడీ యదేచ్ఛగా సాగిందని ఆరోపించారు. వాటాల కోసం ఊర్లను పంచుకున్నారని, మనుషులను తినే తోడేళ్ల వలే 2017కు ముందు పాలన సాగిందని యోగి ఆదిత్యానాధ్ దుయ్యబట్టారు.
Read More :
Harish Shankar | ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్.. నిర్మాతకు రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చిన హరీష్ శంకర్.?