IndiGo | ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం (indigo crisis)పై ఆ సంస్థ సీఈవో (IndiGo CEO) పీటర్ ఎల్బర్స్ (Pieter Elbers) స్పందించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. కష్టకాలం ముగిసిందని తెలిపారు. సంక్షోభం సమయంలో తమకు అండగా నిలిచిన సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు.. ఎయిర్‌లైన్ రోజువారీ సర్వీసులు పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమిష్టి కృషి, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
‘కష్టకాలం ముగిసింది. అతిపెద్ద సవాలును అధిగమించాం. ఇండిగో ఉద్యోగులు, మేము ఒకరికొకరం మద్దతుగా నిలిచి ఈ తుఫాన్‌ను ఎదుర్కొన్నాం. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఓసీసీ, కస్టమర్ సర్వీస్ ఇలా మాకు మద్దతు ఇచ్చిన అన్ని విభాగాల ఉద్యోగులకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అంతేకాదు.. పలు కారణాలు ఒక్కసారిగా ముంచుకురావడంతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చినట్లు చెప్పారు. డిసెంబర్ 9నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఉద్యోగులకు తెలియజేసినట్లు చెప్పారు. ఆ తర్వాత సంస్థ తన షెడ్యూల్‌ను పునర్నిర్మించుకుందని అన్నారు. సంస్థను మరింత దృఢంగా తీర్చిదిద్దడంతో పాటు సమస్యకు కారణాలు అన్వేషించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.
సమస్యకు మూల కారణాన్ని విశ్లేషించేందుకు విదేశీ నిపుణుడిని రంగంలోకి దింపిన విషయాన్ని కూడా సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి అంతరాయాలు ప్రపంచంలోని పెద్ద విమానయాన సంస్థలను కూడా ప్రభావితం చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి కొన్ని సంక్షోభ పరిస్థితులు మన వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూడా సాయపడతాయని అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి గల కారణాలను విశ్లేషించి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇకపై ఉద్యోగులు ప్రశాంతంగా ఉండాలని, వారు బాధ్యతలపై దృష్టిపెట్టాలని సూచించారు. ‘సంస్థలో ప్రస్తుతం 65 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ ఇప్పటివరకు 850 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలందించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలను ప్రపంచానికి అనుసంధానిస్తూ అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. ఏ లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించామో.. ఆ విధంగానే భారత్‌లో సేవలందిస్తూనే ఉంటాము’ అని సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
Also Read..
Air India Express | విమానం గాల్లో ఉండగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య.. కొచ్చికి దారి మళ్లింపు
Dense Fog | ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం