న్యూఢిల్లీ, మే 9: భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం తెరపడింది. తమది సహాయక పాత్ర మాత్రమేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ప్రకటించారు. ‘ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందోనంటూ ఊహాగానాలు మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలు. ప్రపంచ బ్యాంకుది కేవలం సహాయక పాత్ర మాత్రమే’ అని అజయ్ బంగా స్పష్టం చేశారు.
అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలుసుకున్నారు. సింధూ నదీ జలాల పంపకంపై భారత్, పాక్ మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తున్న తరుణంలో 1960లో జోక్యం చేసుకున్న ప్రపంచ బ్యాంకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తి పాత్రను పోషించింది. రెండు దేశాల ఇంజనీర్ల మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు సంప్రదింపులు జరిగిన తర్వాత ఒప్పందంపై ఉభయ దేశాల అధినేతలు సంతకాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.