Terror Attack | మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్ (Pahalgam Terror attack)లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్ట్‌లు మరణించారు. వీరిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మంజునాథ్ కూడా ఉన్నారు. తన భార్య కళ్లెదుటే మంజునాథ్‌ను ఉగ్రవాదులు అతికిరాతకంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మంజునాథ్ భార్య పల్లవి ఆ భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు. ‘నా భర్తను చంపేశారు.. నన్ను కూడా చంపేయండి’ అని వారిని వేడుకున్నట్లు చెప్పారు.
విహార యాత్ర నిమిత్తం తమ చిన్న కుమారుడిని తీసుకుని బైసరన్ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. . ‘నేను, నా భర్త, నా చిన్న కుమారుడు కశ్మీరుకు వెళ్లాము. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేము పెహల్గామ్లో ఉన్నాము. ముగ్గురు, నలుగురు సాయుధులు మాపైన దాడి చేశారు. నా భర్తపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. నా భర్తను చంపేశారు.. నన్ను కూడా చంపేయండి అని వారిని అర్థించాను. నిన్ను చంపము. ఈ విషయాన్ని మోదీకి చెప్పు అని వారిలో ఓ వ్యక్తి అన్నాడు’ అని పల్లవి వివరించారు.
ఫుడ్‌స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోనీలు, ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.
Also Read..
Pahalgam Terror Attack | భూతల స్వర్గం కశ్మీర్ యాత్ర.. ఆ మూడు జంటలకు తీరని శాపం..
Terrorist | పెహల్గామ్ ఘటన.. ఏకే 47 తుపాకీతో ఉగ్రవాది తొలి ఫొటో
Terrorist | ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నటి ఫ్యామిలీ.. కొన్ని గంటల ముందే కశ్మీర్‌ను వీడి..