Pahalgam Terror Attack | కశ్మీర్ యాత్ర అంటేనే.. ప్రకృతి అందాలతో కనుల విందు చేసే ఆకర్షణీయమైన పచ్చిక బయళ్లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, చుట్టూ ఎత్తైన కొండలు.. ఆ కొండల మధ్య నదులు, సరస్సులు ఆకట్టుకుంటాయి. భారీ ఫైన్ వృక్షాల మధ్య మూడు వేల మీటర్ల ఎత్తులో ఉన్న బైసరన్‌లో సూర్యోదయం, సూర్యాస్తామయం చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్టుగా ఆ ప్రకృతి రమణీయత ఎంతో కట్టిపడేస్తుంది. ఎంతో సుందరమైన ఈ ప్రదేశానికి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. కొత్తగా పెళ్లైన జంటలకు మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి గాంచిన బైసరాన్ హనీమూన్‌కు హాట్‌స్పాట్. కానీ ఇప్పుడు ఆ హనీమూన్ స్పాట్.. తుపాకుల తూటాలతో దద్దరిల్లి.. బ్లడ్ మూన్‌గా మారింది. భూతల స్వర్గం కశ్మీర్ యాత్ర.. జీవితాంతం ఒక మధురానుభూతిగా మిగలాలని కోరుకుంటారు.. కానీ ఈ మూడు జంటలకు జీవితాంతం శాపని తీరంగా మారింది.
హర్యానాలోని కర్నాల్‌కు చెందిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్(26)కు ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన వివాహమైంది. ఏప్రిల్ 19న విందు ఏర్పాటు చేశారు. ఇక తన భార్యతో కలిసి బైసరాన్‌కు హనీమూన్‌కు వెళ్లారు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. మంగళవారం మధ్యాహ్నం పచ్చిక బయళ్లపై సేద తీరుతూ.. చల్లని గాలులను ఆస్వాదిస్తూ.. ముచ్చటించుకుంటున్న ఆ జంటను ముష్కరులు చుట్టుముట్టారు. వినయ్‌పై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దాంతో పచ్చిక బయళ్లపై రక్తపుటేరులు పారాయి. వినయ్ భార్య దిక్కుతోచని స్థితిలో ధీనంగా ఉండిపోయింది. పెళ్లైన ఏడు రోజులకే భర్తను కోల్పోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వినయ్ కొచ్చిలో ఉద్యోగం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది కూడా కొత్త పెళ్లి కొడుకే. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న పెళ్లైంది. బిజీ లైఫ్‌లో ఉన్న ద్వివేది.. ఇప్పటి వరకు ఎలాంటి పర్యటనకు తన భార్యతో కలిసి వెళ్లలేదు. తీరిక దొరకడంతో.. ఇటీవలే తన భార్యతో కలిసి కశ్మీర్ యాత్రకు వెళ్లాడు శుభం. బైసరాన్లో గడుపుతున్న శుభం దంపతులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. భార్యను వదిలేసి శుభంపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో శుభం ప్రాణాలు కోల్పోయాడు. అయితే శుభంను మరి పేరు అడిగి కాల్చి చంపినట్లు ఆయన భార్య తెలిపారు.
బితన్ అధికారి.. ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి. టీసీఎస్ ఉద్యోగి అయిన బితన్.. అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. తన భార్య సోహినీ, మూడేళ్ల కుమారుడితో కలిసి ఏప్రిల్ 8న బితన్ స్వదేశానికి వచ్చాడు. ఇక కశ్మీర్ చుట్టేద్దామని చెప్పి గత వారం.. కశ్మీర్ యాత్రకు వెళ్లాడు. బైసరాన్లో తన భార్యాకుమారుడితో సేద తీరుతున్న బితన్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బితన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భర్తను కోల్పోయిన సోహిని, ఆమె కుమారుడు గుండెలవిసేలా రోదించారు.