ముంబై.మే 11 (నమస్తే తెలంగాణ): ముంబై, కర్జత్ రైలు పట్టాల పకన ఓ సూట్‌కేస్‌లో యువతి మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఈ మిస్టరీని 25రోజుల్లోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వీ విజయకుమార్ వెంకటేశ్, టీ యశస్విని రాజా, ధనలక్ష్మి కొన్ని నెలల క్రితం బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చి పొవైలో నివసించేవారు.
ఈక్రమంలో ఏప్రిల్ 16న ముంబై నుంచి పుణె వెళ్లే రైల్వేలైన్‌లోని కర్జాత్ సమీపంలో గులాబీరంగు సూట్‌కేసులో ఓ యువతి మృతదేహం లభించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు ఏపీ రాయపాడుకు చెందిన ధనలక్ష్మిగా గుర్తించారు. అనంతరం సీసీఫుటేజీల ఆధారంగా వీ విజయ్‌కుమార్, టీ యశస్వినిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. అయితే వీరు ధనలక్ష్మిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో దర్యాప్తు తెలియాల్సి ఉంది. హత్య కేసును ఛేదించిన పోలీసులను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభినందించడంతోపాటు, 20వేల నగదు రివార్డు అందజేశారు.