జైపూర్: సహజీవనం చేస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. అతడి తాగుడు అలవాటును ఆమె భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని తాడుతో కట్టేసింది. గొంతు నొక్కి హత్య చేసింది. (Woman Kills Live-In Partner) రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల హరక్‌చంద్ లోధా తన భార్య, పిల్లలను వదిలేశాడు. 30 ఏళ్ల రేఖతో కలిసి గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నాడు.
కాగా, హరక్‌చంద్ నిత్యం మద్యం సేవించి వచ్చి రేఖతో గొడవపడేవాడు. అయితే అతడి తాగుడును ఆమె భరించలేకపోయింది. ఆగస్ట్ 21న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న హరక్‌చంద్ చేతులు, కాళ్లను తాడుతో రేఖ కట్టేసింది. ఆ తర్వాత గొంతునొక్కి అతడ్ని హత్య చేసింది. ఆ రాత్రంతా మౌనంగా ఉన్నది. ఎవరికీ ఈ విషయాన్ని ఆమె చెప్పలేదు.
మరోవైపు మరునాడు ఉదయం ఇంటి పనుల్లో రేఖ నిమగ్నమైంది. పొరుగున నివసించే హరక్‌చంద్ సోదరుడు అతడి గురించి అడిగాడు. దీంతో మరణించి మంచంపై ఉన్న హరక్చంద్ను చూపించింది. అతడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. హరక్‌చంద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు