ముంబై: ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. ఇంటి వద్ద గొయ్యి తీసి పాతిపెట్టాడు. తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Man Reports Wife Missing) అయితే వాసన రాకుండా ఉండేందుకు అతడు ఉంచిన కలరా ఉండలు భార్య హత్య విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హింగన్ఘాట్కు చెందిన వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతడు మాయమయ్యాడు.
కాగా, భార్య మిస్సింగ్‌పై దర్యాప్తు కోసం ఆ వ్యక్తికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే అతడి మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉన్నది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లగా అతడు కనిపించలేదు. ఆ ఇంటి పరిసరాల్లో దుర్వాసన రావడాన్ని గమనించారు. ఆ ఇంటి సమీపంలో కలరా ఉండలు ఉండటాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ తవ్విన ఆనవాళ్లు కూడా వారికి కనిపించాయి.
మరోవైపు పోలీసులు అనుమానంతో అక్కడ తవ్వించారు. సంచిలో కుక్కి పాతిపెట్టిన మహిళ మృతదేహం బయటపడింది. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసినట్లు నిర్ధారించారు. మిస్సింగ్ ఫిర్యాదు తర్వాత పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: