న్యూఢిల్లీ: ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (Woman, Son Murder) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున గోవింద్‌పురి ప్రాంతంలో నివసించే 38 ఏళ్ల మహిళ, ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుమారుడు ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో పొడిచి వారిని చంపారు. ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త ఇది చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, వారపు మార్కెట్లో పండ్లు, కూరగాయలు అమ్ముకునే తాను 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్లు విష్ణు సాహు పోలీసులకు తెలిపాడు. ఇంటి తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉన్నట్లు చెప్పాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య, కుమారుడి మృతదేహాలపై పలుచోట్ల కత్తిపోట్లు కనిపించాయని పోలీసులకు తెలిపాడు. బీరువాలో దాచిన డబ్బు, బంగారు ఆభరణాలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకుని పరిశీలించారు. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. మహిళ, ఆమె కుమారుడి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జంట హత్యల వెనుక దోపిడీయే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య, దొంగతనం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.