లక్నో : బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ తాగించారు. పరిస్థితి విషమించిన తర్వాత దవాఖానలో చేర్పించారు. ఆమె 17 రోజులపాటు బతకడం కోసం పోరాడి గురువారం తుది శ్వాస విడిచింది. గుల్ఫిజకు ఏడాది క్రితం పర్వేజ్తో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, ఓ కారు ఇవ్వాలని ఆమె అత్తింటివారు డిమాండ్ చేశారు.
మృతురాలి తండ్రి ఫుర్కాన్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత వరకట్న మరణానికి సంబంధించిన సెక్షన్లను జోడిస్తామని, నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో 26 ఏండ్ల వివాహితను ఇంట్లోనే ఆమె భర్త, బంధువులు సజీవ దహనం చేసినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మృతురాలి భర్త, మామ, బావతోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు.