పాట్నా: పెళ్లైన కొన్ని రోజుల్లోనే భర్తను భార్య హత్య చేయించింది. (Woman Kills Husband After Wedding) మేనమామను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ మహిళ, భర్తను చంపేందుకు అతడితో కలిసి ప్లాన్ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు హంతకులతోపాటు ఆమెను అరెస్ట్ చేశారు. మేఘాలయ హనీమూన్ హత్యను తలపించిన ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బార్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాంషుతో 20 ఏళ్ల గుంజా దేవికి 45 రోజుల కిందట పెళ్లి జరిగింది.
కాగా, మేనమామ అయిన 55 ఏళ్ల జీవన్ సింగ్, గుంజా దేవి మధ్య సంబంధం ఉన్నది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే గుంజా దేవి కుటుంబం ఒప్పుకోలేదు. నెలన్నర కిందట ప్రియాంషుతో బలవంతంగా ఆమెకు పెళ్లి చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లైన కొన్ని రోజులకే భర్తను చంపేందుకు గుంజా దేవి, ఆమె మేనమామ జీవన్ సింగ్ కలిసి ప్లాన్ వేశారు.
మరోవైపు జూన్ 25న ప్రియాంషు తన సోదరి ఊరికి వెళ్లాడు. రైలులో తిరుగుప్రయాణమై నవీ నగర్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను పికప్ చేసుకునేందుకు బైక్‌పై ఎవరినైనా పంపాలని భార్య గుంజా దేవికి ఫోన్ చేశాడు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఇద్దరు వ్యక్తులు ప్రియాంషును కాల్చి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, భర్త హత్య తర్వాత గుంజా దేవి ఆ గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆమెపై అనుమానించిన అత్తింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గుంజా దేవిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మొబైల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. మేనమామ జీవన్ సింగ్‌తో నిరంతరం ఆమె మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు మేనమామ కాల్ డేటా పరిశీలించగా కాల్పులు జరిపిన వ్యక్తులతో అతడు టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో గుంజా దేవి, హంతకులైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న జీవన్ సింగ్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్యను తలపించిన ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
Also Read: