భోపాల్: దళితుడిని పెండ్లి చేసుకుందని తన కూతురికి గుండు గీయించి పుణ్యస్నానం చేయించాడో తండ్రి. అతనికి విడాకులివ్వాలని ఒత్తిడి తీసుకువచ్చిన ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో జరిగింది.
బేతుల్లోని చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్ హాస్టల్ ఉంటూ నర్సింగ్ కోర్సు చదువుతున్నది. గతేడాది మార్చి 11న అమిత్ అహిర్వార్ అనే దళితుడిని ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నది. అయితే తాను పెళ్లి చేసుకున్నట్లు ఈ ఏడాది జనవరి 4న తన తండ్రికి చెప్పింది. దీంతో అతడు జనవరి 10న తన కూతురు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సింగ్ పూర్తిచే యడానికి ఫిబ్రవరిలో మళ్లీ హాస్టల్కు వెళ్లింది.
గత ఆగస్టు 18న ఆమె తండ్రి రాఖీపౌర్ణమి పేరుతో హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెను హోషంగాబాద్లోని నర్మదా నది వద్దకు తీసుకువెళ్లి.. ఆమెకు గుండు చేయించాడు. దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు బలవంతంగా ఆమెతో పుణ్యస్నానం చేయించాడు. అప్పటితో ఆగకుండా భర్తకు విడాకులు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకువచ్చారు.
వేధింపులు ఎక్కువవడంతో ఎలాగో అలా వారినుంచి తప్పించుకున్న సాక్షి.. తన భర్తవద్దకు చేరుకుంది. జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.