Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న ఓ బాలుడు తన తల్లి నీటి కష్టాలకు చలించిపోయి ఇంటి ఆవరణలోనే బావిని తవ్విన దృశ్యాన్ని చూశాం.
ఇప్పుడేమో ఓ మహిళ మంచినీళ్ల కోసం పెద్ద సాహసమే చేసింది. బావిలో దిగి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత కష్టపడితే వారికి నోటికాడికి చేరేది మురికి నీరే. ఆ మురికి నీళ్ల కోసం ఓ మహిళ భగీరథ ప్రయత్నం చేస్తూ.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లోని కోషింపాడ గ్రామానికి చెందిన ప్రజలు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలకు చుక్క మంచి నీరు దొరకడం లేదు. దీంతో దప్పికతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ గ్రామ ప్రజలంతా కిలో మీటర్ దూరంలో ఉన్న ఒక బావి మీదనే ఆధారపడ్డారు. ఉపాధి పనులు వదులుకొని, కిలోమీటర్ దూరం నడిచి, నీటిని సేకరిస్తున్నారు. అయితే అంత కష్టపడితే వారికి దొరికేదే అరకొర నీళ్లు.. మురికి నీళ్లే. ఆ నీళ్ల కోసం మహిళలు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఓ మహిళ బావిలోకి దిగి నీటిని సేకరిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో నీటి కష్టాలు లేవు. ఉద్యమ రథసారథి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇంటింటికీ నల్లా అందించి.. ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల బిందెల ప్రదర్శనలు లేవు. నీళ్ల కోసం మహిళలు బిందెలతో కాలినడకన వెళ్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. అందుకే మహారాష్ట్రలోని పలు జిల్లాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు.
#WATCH | Maharashtra: Due to the water crisis, people of Koshimpada Village are compelled to consume; descent into a well to fetch water pic.twitter.com/6orDLsCpyQ
— ANI (@ANI) May 24, 2023