Maharashtra : మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహారాష్ట్రలోని అంబర్ నాథ్ మున్సిపాలిటీలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ బీజేపీ, అటు కాంగ్రెస్ తోపాటు, ఎన్సీపీతో కలిసి అంబర్ నాథ్ వికాస్ అఘాఢి పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. దీని ద్వారా శివసేనకు చెక్ పెట్టేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే అకోలా జిల్లాలోని అకోటా మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలా రెండు చోట్ల బీజేపీ.. అటు కాంగ్రెస్, ఇటు ఎంఐంతో పొత్తు పెట్టుకోవడంపై శివసేన వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మున్సిపల్ సీట్లు దక్కించుకునేందుకు స్థానికంగా ప్రత్యర్థి పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మహాయుతి కూటమి నేత, రాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇలా పొత్తులు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించేందుకు పార్టీ నేతలకు ఆదేశాలిచ్చామన్నారు.
60 సీట్లున్న అంబర్ నాథ్ లో బీజేపీ-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికివ 31 సీట్లు ఉండగా, అత్యధిక స్థానాలు (27) ఉన్న శివసేనకు అధికారం దూరమవుతుంది. దీంతో బీజేపీ తరఫున తేజశ్రీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ పరిణామంపై ఉద్ధవ్ ఆధ్వర్యంలోని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి పొత్తు ధర్మాన్ని బీజేపీ విస్మరించి, అనైతిక చర్యలకు పాల్పడుతోందని శివసేన విమర్శించింది. మరోవైపు ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. తమ పార్టీ కూటమిలో లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.